మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్‌సీపీ | YSRCP MLC Thota Trimurthulu Fires On Atchannaidu Over His Comments On Council Chairman And YS Jagan, More Details Inside | Sakshi
Sakshi News home page

మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్‌సీపీ

Mar 4 2026 5:08 PM | Updated on Mar 4 2026 6:09 PM

Ysrcp Mlc Thota Trimurthulu Fires On Atchannaidu

సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్‌ ఇందాపూర్‌ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డి
శాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్‌సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.

తిరిగి వైఎస్సార్‌సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్‌ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.

మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్‌ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్‌ రెడ్డిగారితో పాటు ఛైర్మన్‌ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్‌ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్‌ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్‌ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్‌ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్‌ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.

చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి
తిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్‌ జగన్‌ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్‌ జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.

మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్‌ అనుబంధ సంస్థ ఇందాపూర్‌ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్‌ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్‌ డెయిరీ కూడా మీ హయాంలోనే 95  శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.

హెరిటేజ్‌పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావు
గత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్‌కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్‌ లేకుండానే హెరిటేజ్‌ పాల పౌడర్‌ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్‌ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్‌ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్‌–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్‌ వేశారు కదా అని అడిగితే మేం ఎల్‌–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్‌ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.

అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులు
లడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్‌ డెయిరీకి, హెరిటేజ్‌ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్‌ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.

కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్‌ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని  చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్‌ జగన్‌ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.

లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్‌
ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.

ఛైర్మన్‌ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణి
పది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్‌ ను కూడా మతం పేరుతో టార్గెట్‌ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.

లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్‌ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు

ఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డి
బడ్జెట్‌ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్‌ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.

ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డి
లడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్‌ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.

ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్‌కుమార్‌
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్‌లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.

సుమారు 500 మంది నారా లోకేష్‌ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్‌ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్‌లు విడుదల చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement