టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్‌ | YS Jagan Serious Comments On TTD Chairman And Laddu Issue | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్‌

Mar 4 2026 12:34 PM | Updated on Mar 4 2026 12:48 PM

YS Jagan Serious Comments On TTD Chairman And Laddu Issue

సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డూ కాంట్రాక్టులో స్కాంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ విమర్శించారు. పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల. తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్‌ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు.

ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ, చర్యలు పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా. చంద్రబాబు​కు భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.

లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్‌ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్‌ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.

ఈ రకంగా చంద్రబాబు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278-330గా ఉంది. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ, ఇందాపూర్‌ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ’ అని పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement