చిలకలూరిపేట: మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు విడుదల చేయడంలో జాప్యం చేయడాన్ని ఎస్టీయూ తీవ్రంగా విమర్శిస్తుందని వెల్లడించారు. 13 వేల మంది ఉపాధ్యాయులు 59 అర్బన్ లోకల్ బాడిలలో పనిచేస్తున్నారని చెప్పారు. వీరిని 2022లో విద్యాశాఖలో విలీనం చేసినా నేటికీ సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టు లేని కారణంగా పదోన్నతులు, బదిలీల సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వి అక్కయ్య, షేక్ జమీర్‌బాష, ఎం కోటేశ్వరరావు, వి జయప్రకాశ్, కాలేషా పాల్గొన్నారు.


