● వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యక్తి, కుటుంబం, సమాజం పట్ల సరైన అవగాహన కలిగించి దృఢమైన పోరాట పటిమ అలవర్చేది ప్రభుత్వ బడి అని అన్నారు. ప్రభుత్వ బడి ప్రజలందరి సంపదని, దీనిని రక్షించుకోవాల్సిన పని సమాజం తీసుకోవాలని కోరారు. ప్రతి ఉపాధ్యాయుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడి పట్ల నమ్మకాన్ని కలిగించి, ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు.
● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి, విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఉచితంగా అందుతున్నాయని, వ్యాయామం, లైబ్రరీ, ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ బడి ఈడు గల పిల్లలందర్నీ ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
● యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ యూటీఎఫ్ చేస్తున్న ప్రభుత్వ బడి అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు సహకారం అందించాలని కోరారు.
యూటీఎఫ్ పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్ : రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అడ్మిషన్ క్యాంపెయిన్ చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యావర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నాయకులతో కలసి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవింద్, టి.ఆంజనేయులు, కె.రంగారావు, బి.ప్రసాదు, కె.కేదార్నాథ్, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు.