జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలేనా? | Clash Between TDP Janasena Leaders in P Gannavaram Konaseema District | Sakshi
Sakshi News home page

జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలేనా?

Mar 4 2026 1:18 PM | Updated on Mar 4 2026 1:54 PM

 Clash Between TDP Janasena Leaders in P Gannavaram Konaseema District

సాక్షి, అమలాపురం: ‘అధికారం ఒకరిది... పెత్తనం మరొకరిది’’ అన్నట్టుగా ఉంది రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో రాజకీయం. మిత్రధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న లీడర్‌ విత్‌ క్యాడర్‌ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరిస్తున్నామనే వంకతో ప్రభుత్వ పథకాల పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. తద్వారా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేస్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీలో ఉండి కూడా తమకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరిని అడగాలో తెలియని దైన్య స్థితిలో జనసేన శ్రేణులు మధనపడుతున్నాయి. 

గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గెలిచారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాలకు చెందినవారే అయినా ఉద్యోగ రీత్యా ఎన్నికల ముందు వరకు స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవు. అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గ ఓటర్లకు తెలియకుండానే విజయాలు సాధించారు. ఆ తరువాత కూడా వారు స్థానికులతో పెద్దగా సంబంధాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. కనీసం క్యాడర్‌తో కూడా సన్నిహిత సంబం«ధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీకి చెందిన నాయకులు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కనబెట్టి నేరుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

రాజోలులో.. 
రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీలలో వర్గ పోరు అధికంగా ఉంది. ముఖ్యంగా రాజోలు జనసేనలో సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతున్న వర్గ పోరు పోలీసు స్టేషన్‌ల వరకు చేరిన విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రాజోలు పార్టీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై స్వీకరించిన వినతులలో కొన్నింటిని మాత్రమే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళుతున్నారు. మరికొన్ని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడం లేదా నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమం పేరుతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధ పల్లంరాజుల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఈ ముగ్గురికి ఎటువంటి అధికార హోదా లేకపోవడం ఇక్కడ గమనార్హం.  



పి.గన్నవరంలో.. 
పి.గన్నవరంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు వంటి పార్టీ సీనియర్‌ నాయకులకు పొగబెట్టిన ఇక్కడ నాయకులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ డి.వి.వి.సత్యనారాయణ వంటి వారు లీడర్‌ విత్‌ క్యాడర్‌ అంటూ నియోజకవర్గంలో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. ఫించన్లకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నేరుగా అధికారులకే సిఫారసులు చేసేస్తున్నారు. 

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కొన్నింటికైనా పరిష్కారం చూపిస్తున్నారు. కలెక్టరేట్‌తోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన అధికారులే నేరుగా అర్జీలు స్వీకరిస్తుంటే టీడీపీ నాయకులు లీడర్‌ విత్‌ క్యాడర్‌ పేరుతో అవే సమస్యల పరిష్కారం కోసం అంటూ చేస్తున్న హంగామా, ప్రచార ఆర్భాటం చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.  

అక్కడ అణగిమణగి.. 
జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పదవులు కూడా లేని నాయకులు పెత్తనం చేస్తుంటే పార్లమెంట్‌  పరిధిలో మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా అణగిమణగి ఉండాల్సిందే. స్థానిక ఎమ్మెల్యేలను కాదని వీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పెత్తనాలు చేయడమనేది కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించిన బండారు శ్రీనివాసరావు కొత్తపేటలోను, రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలోను, పవన్‌ కళ్యాణ్‌కు సన్నితంగా ఉన్న పార్టీ నాయకులు నల్లా శ్రీధర్‌ అమలాపురంలోను, నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌ రామచంద్రపురంలోను కిమ్మనకుండా ఉండాల్సిందే. 

ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కనీసం వీరి ఉనికిని కూడా గుర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే జనసేన నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పెత్తనం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సీనియర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, పార్టీ పెద్దలకు చెప్పినా సర్దుకు పొమ్మంటున్నారే తప్ప పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో లోలోనే మధనపడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement