శ్మశాన వాటికలో చేయలేని దుస్థితిలో ఉన్నామా?
శ్మశానాల నిర్వహణకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదు
జీవోలిచ్చినా ఎందుకు అమలు చేయడం లేదు
శ్మశాన వాటికల ఏర్పాటు.. నిర్వహణకు ఓ కార్యాచరణ రూపొందించండి
యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను రోడ్డుపైనే నిర్వహించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ కోసం జీవోలు ఇచ్చినప్పటికీ అవేవీ అమలు కావడం లేదంది.
ఆ జీవోలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలకు అనుగుణంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న శ్మశానాల నిర్వహణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. శ్మశాన వాటికల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను సైతం విడుదల చేయాలని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలను అమలు చేసి దానిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన పి.ప్రమోద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.


