రోగులతో చెలగాటం! | Scrub typhus tests conducted with outdated kits at Kakinada GGH | Sakshi
Sakshi News home page

రోగులతో చెలగాటం!

Dec 4 2025 5:19 AM | Updated on Dec 4 2025 5:19 AM

Scrub typhus tests conducted with outdated kits at Kakinada GGH

వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో ఉన్న కాలం చెల్లిన స్క్రబ్‌ టైఫస్‌ రియేజంట్ల కిట్లు

కాకినాడ జీజీహెచ్‌లో కాలం చెల్లిన కిట్లతో స్క్రబ్‌ టైఫస్‌ పరీక్షలు

కోవిడ్‌ సహా ప్రాణాంతక రోగ నిర్ధారణలకు ఎక్స్‌పైరీ రియేజంట్ల వినియోగం 

ప్రజలు, వైద్య ఆరోగ్యశాఖను తప్పుదోవ పట్టించి రిపోర్టులు 

వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ నిపుణుడి నిర్వాకం

రీసెర్చ్‌ సైంటిస్ట్‌ హోదాలోని ఆ ఉద్యోగి బరితెగింపు.. ఫోరెన్సిక్‌ వైద్యులు, మృతుడి కుటుంబీకుల ప్రాణాలకూ ముప్పు 

స్టేట్‌ పోర్టల్‌లోనూ ఈ కాకిలెక్కలే అప్‌డేట్‌  

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న వీఆర్‌డీఎల్‌ (వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీ)లో దారుణం జరుగుతోంది. ఎక్స్‌పైరీ అయిపోయిన రసాయనాల (రియేజంట్ల)తో స్క్రబ్‌ టైఫస్‌ పరీక్షలు చేసి, కొందరికి అసలు చేయకుండానే నకిలీ రిపోర్టులు ఇచ్చి ప్రజల్ని, అధికారుల్ని పచ్చిమోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా ఈ తంతు కొనసాగుతుండడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లుగా వచ్చిన నివేదికలన్నీ కేవలం సృష్టించినవేనన్న వాస్తవం కళ్లుబైర్లు కమ్మేలా చేస్తోంది. 

తీవ్ర కలకలం రేపుతున్న ఈ దారుణం వివరాలివీ.. కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. రీసెర్చ్‌ సైంటిస్ట్‌ హోదాలో పనిచేసే ఓ ఉద్యోగి కాసులకు కక్కుర్తిపడి స్క్రబ్‌ టైఫస్‌ పరీక్షలు చేసేందుకు రక్త నమూనాలు సేకరించి నకిలీ రిపోర్టులు ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణకు ఐజీఎం ఎలీసా (ఇమ్యునో గ్లోబలిన్‌ ఎం–ఎంజైమ్‌ లింక్డ్‌ ఇమ్యూనో సార్బెంట్‌ అస్సే) టెస్ట్‌ చేస్తారు. ఇందుకు కాలంచెల్లిన రియేజంట్లు వినియోగించి రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. 

రెండు నెలలుగా ఇదే తంతు.. 
సాధారణంగా రక్త నమూనా ఇచ్చిన తర్వాత రక్తం నుంచి సీరంను వేరుచేసి ఎలీస్‌ ప్లేట్‌లో ఉన్న రంధ్రాల్లో వేస్తారు. అరగంట ఇంక్యుబేషన్‌ వ్యవధి చొప్పున కాంజ్యుగేట్, సబ్‌్రస్టేట్‌ రియేజంట్లు వేస్తారు. ఇవే వ్యాధిని నిర్ధారిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న రియేజంట్లను కాలం చెల్లినవి వాడి రెండు నెలలుగా తోచిన రిపోర్టును రాసి పంపిస్తున్నారు. అంతేకాక.. స్టేట్‌ పోర్టల్‌లోనూ ఈ కాకిలెక్కలే అప్‌డేట్‌ చేస్తుండడంతో యావత్‌ రాష్ట్రం ఈ గణాంకాలనే నిజమని నమ్ముతోంది. 

రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలకు బురిడీ.. 
ఈ తప్పుడు నివేదికల ఆధారంగానే వైద్యం అందించడం, అందించకపోవడం జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగాలను ఈ వీఆర్‌డీఎల్‌ ఉద్యోగి బురిడీ కొట్టించడం ఇప్పుడు తీవ్ర చర్చ­నీ­యాంశమైంది. రోగి వయసు, ప్రాంతం ఆధారంగా వ్యాధి సోకే అవకాశం ఉందా లేదా అన్న విషయాలపై ఓ అంచనాకు వచ్చేసి, నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లూ ఇచ్చిన పాజిటివ్, నెగటివ్‌ నివేదికలు కల్పితాలేనన్న విష­య­ం బట్టబయలవడంతో వైద్యులే నిర్ఘాంతపోతున్నారు.  

ఎక్స్‌పైరీ రియేజంట్లు ఎందుకంటే.. 
కాలంచెల్లిన కిట్ల వినియోగం వెనుక రీసెర్చ్‌ సైంటిస్ట్‌దే కీలకపాత్ర. నెలన్నరకు పైగా జీజీహెచ్‌ స్టోర్స్‌ నుంచి రియేజంట్లు తీసుకోకుండా ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఇచ్చిన అవకా«శాన్ని అడ్డుపెట్టుకుని బయటి నుంచే కొంటున్నట్లు ఆయన చూపిస్తున్నారు. అవీ కాలం చెల్లినవి తెస్తున్నారు. పొరుగు ప్రాంతాల వారు పనికిరాక పక్కన పడేసిన కిట్లు ఉచితంగా లభిస్తుండడంతో అవి తెచ్చి నాణ్యమైనవి కొంటున్నట్లు బిల్లులు డ్రా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా.. ఒక్కో కిట్టు ధర కనీసం రూ.25 వేలు ఉంటుండగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఏ ఒక్క కిట్టుకీ లెక్కాపత్రం లేదు.. 
వైరాలజీ ల్యాబ్‌లో వినియోగిస్తున్న ఏ ఒక్క కిట్టుకీ తగిన లెక్కాపత్రం లేదు. ఈ తంతుపై పర్యవేక్షణ లోపించడంతో అక్కడ పనిచేస్తున్న రీసెర్చ్‌ సైంటిస్టుది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కిట్లు కాలం చెల్లినవి కావడంవల్ల కోల్డ్‌ చెయిన్‌ను మెయింటైన్‌ (నిర్దిష్ట శీతల ప్రక్రియ) చేయకుండానే జీజీహెచ్‌లోని ల్యాబ్‌కు చేరుతున్నాయి. ఇలా అందుకుంటున్న వాటికి ఎటువంటి బిల్లులుగానీ సరఫరా రశీదులుగానీ ఉండడంలేదు.

కోవిడ్, హెపటైటిస్‌ రియేజంట్లు కూడా..
ఇక కోవిడ్, హెపటైటిస్‌ సహా పలు ప్రాణాంతక రోగాలను నిర్ధారించే రియేజంట్లు కూడా కాలం చెల్లినవే వినియోగిస్తున్నారు. మరణించిన వ్యక్తికి కోవిడ్‌ పరీక్ష చేయాల్సి వస్తే పరీక్ష చేయకుండా లేదా కాలంచెల్లిన కిట్లతో చేసి, రిపోర్టు ఇస్తున్నారు. పోస్ట్‌మార్టం చేస్తున్న ఫోరెన్సిక్‌ వైద్యులు, మృతుడి కుటుంబీకుల ప్రాణాలకూ ముప్పుతెస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎక్స్‌పైర్‌ అయిన హెపటైటిస్‌ కిట్ల­ను డిసెంబరు 1న తీసుకొచ్చి, హెప­టైటిస్‌ పరీక్షలు చేస్తున్నారు. 

ఎక్స్‌పైరీ రియేజంట్లను తేదీ ముద్రించి ఉన్న ట్యూబ్‌ల నుంచి స్టిక్కర్‌ లేని ఖాళీ ట్యూబ్‌ల్లోకి నింపి శ్వాసకోశ సంబంధిత ప్రాణాంతక కోవిడ్‌ సహా ఫ్లూ–ఏ, ఫ్లూ–బి, ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ–ఏ, ఆర్‌ఎస్‌వీ–బి, హ్యూమన్‌ రినోవైరస్‌ వంటి ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు..  రోగులు కూడా జీజీహెచ్‌ నివేదికలకు, బయట ప్రైవేటు ల్యాబ్‌ల నివేదికలకు తేడాలు ఉంటున్నాయని వాపోతున్నారు.  

ఆ కేసులు నిజమా.. కాకిలెక్కలా?
జిల్లా వ్యాప్తంగా స్క్రబ్‌ టైఫస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ గణాంకాల ఆధారంగానే ఈ వ్యాప్తిని నిర్ధారిస్తున్నారు. రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 151 మందికి స్క్రబ్‌ టైఫస్‌ సోకిందని.. నవంబరు, డిసెంబరులో 45 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కల సంగతి ఏంటని జీజీహెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవి నిజం లెక్కలా లేక కాకి లెక్కలా తెలీక గందరగోళంలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement