డాక్యుమెంట్లు బయటకు రాకుండా సీఐడీ ఎందుకు అడ్డుకుంటోంది?
కోర్టు డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే
వాటిని ఎవరైనా తీసుకోవచ్చు
డాక్యుమెంట్ల కోసం వేసిన పిటిషన్‌పై ఉత్తర్వులివ్వండి
ఏసీబీ కోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు
నేడు ఉత్తర్వులిస్తామన్న న్యాయస్థానం
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను మూసివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.. అందుకు సంబంధించిన కాపీలను బహిర్గతం చేయకపోవడంపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో ఏదీ రహస్యం కాదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను బహిర్గతం చేయడాన్ని సీఐడీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
డాక్యుమెంట్ల కాపీలు బయటపెట్టే విషయంలో సీఐడీ ఎందుకు జంకుతోందని నిలదీశారు. ఏదో గూడుపుఠాణి లేకుంటే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ప్రాసిక్యూషన్‌కు ఏముందని ప్రశి్నంచారు. ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అది న్యాయపాలనలో భాగమని స్పష్టం చేశారు. కోర్టులోని ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంటేనని, అది కక్షిదారులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తి కాదని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదు
కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదని పొన్నవోలు కోర్టుకు వివరించారు. చార్జిషీట్, ఎఫ్‌ఐఆర్‌లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చన్నారు. ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని నివేదించారు. ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తయినా కూడా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళని స్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు.
కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్.శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచి్చందని కూడా ఆయన తెలిపారు.
ఏ డాక్యుమెంట్‌నైనా తీసుకోవచ్చు
కేవలం పార్ట్–1 కేసు డైరీని మాత్రమే బహిర్గతం చేయకూడదని, మిగిలిన ఏ డాక్యుమెంట్‌నైనా తీసుకోవచ్చని పొన్నవోలు కోర్టుకు వివరించారు. కోర్టు డాక్యుమెంట్లను తీసుకునే విషయంలో లోకస్ స్టాండీ (జోక్యం చేసుకునే హక్కు) వాదనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదన్నారు. క్రిమినల్ లాలో ఎక్కడా లోకస్ స్టాండీ ప్రస్తావనే లేదన్నారు. అలాంటప్పుడు దేని ఆధారంగా చంద్రబాబుపై కేసుల మూసివేత డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు.
చట్టాన్ని పాటించబోమంటే, సుప్రీంకోర్టులో పోరాటం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్ల కాపీలను కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు.
చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను ఇవ్వాలని కోరుతూ చీరాలకు చెందిన సువర్ణరాజు అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన తరఫున బుధవారం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.


