తిరుపతి జిల్లా చిట్టమూరులో 27.6 సెం.మీ. వర్షం
గోడకూలి వృద్ధురాలు దుర్మరణం
అల్పపీడనంగా మారిన దిత్వా తుపాను
మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్‌లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జలదిగ్బంధంలో నెల్లూరు హైవే
వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.
నీట మునిగిన కాలనీలు
భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్‌టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.
గోడ కూలి వృద్ధురాలి మృతి
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.


