అనంతపురం: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు.
ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ప్రాణాపాయ స్థితిలో..
అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్‌ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.


