సింధూర వర్ణం.. కాంతులీనిన కసాపురం
● ఘనంగా హనుమద్ వ్రతం
గుంతకల్లు రూరల్: వేలాదిగా తరలి వచ్చిన ఆంజనేయస్వామి మాల ధారులతో కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం సింధూర వర్ణంతో కాంతులీనింది. భక్తుల ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. ఆంజనేయ పాహిమాం, పవనపుత్ర రక్షమాం అని స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యం పొందారు. ఆంజనేయస్వామి మాలధారుల మండల దీక్షలు ముగియడంతో బుధవారం ఆలయంలో హనుమద్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముందుగా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఆ తరువాత మాలధారులు తమ ఇరుముడుల ద్వారా సమర్పించిన ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, స్వర్ణాభరణాలతో నెట్టికంటి ఆంజనేయస్వామిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేదికపై కొలువుదీర్చారు. వేదపండితులు హనుమద్ వ్రతం విశిష్టత, నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్ర మహిమను వివరించారు. మహామంగళహారతితో హనుమద్ వ్రతం ముగించి భక్తులకు, మాలధారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
హనుమద్ వ్రతంలో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాలధారులు ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ ముందు భాగంలో ఏర్పాట్లు చేశారు. మాలధారులు, భక్తుల కోసం వసతి కల్పించారు. ఆలయ ప్రధాన గోపురం ముందు రెండు మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, కసాపురం ఎస్సై వెంకటస్వామి, రూరల్ ఎస్సై రాఘవేంద్రప్ప పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు, ఆలయ అను వంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి, హనుమద్ వ్రతంలో పాల్గొన్న మాలధారులు
సింధూర వర్ణం.. కాంతులీనిన కసాపురం


