రోడ్డెక్కిన పత్తి రైతులు
● పత్తి కొనుగోలు చేయలేదని ఆందోళన
గుత్తి: పత్తి కొనుగోలు చేయలేదంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటన పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం రైతులు 14 ట్రాక్టర్లు, 407 వాహనాల్లో పత్తిని విక్రయించడానికి వచ్చారు. అయితే, ఏడుగురు రైతులకు సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేసిన సిబ్బంది.. నాణ్యత లోపించిందంటూ మిగతా పత్తిని తిరస్కరించారు. పత్తిని కొనుగోలు చేయాలని కోరినా ఒప్పుకోకపోవడంతో రోడ్డుపై పత్తి వాహనాలను ఉంచి రైతులు రాస్తారోకో చేశారు. దీంతో దిగొచ్చిన సీసీఐ అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఏడుగురు విద్యార్థుల డీబార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న యూజీ మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన ఏడుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురిని బుక్ చేశామన్నారు.
విల్డ్ తెగులు సోకిన మిరప పంట పరిశీలన
ఉరవకొండ/విడపనకల్లు: మిరపకు విల్డ్ తెగులు శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త యుగంధర్, హార్టికల్చర్ అధికారిణి యామిని, విడపనకల్లు మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య, సిబ్బంది బుధవారం ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరప పూత, కాయ దశలో ఉండటంతో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుందన్నారు. నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 10 గ్రాముల ప్ట్రెప్టొసైక్లిన్ కలిపి మొక్క పాదుల్లో పిచికారీ చేయాలన్నారు. జెమిని ఆకుముడత నివారణకు ఫెరిఫ్రాక్టిఫిన్ 1.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధం 3 గ్రాములు వాడాలన్నారు.
రోడ్డెక్కిన పత్తి రైతులు
రోడ్డెక్కిన పత్తి రైతులు


