జగన్‌తోనే దివ్యాంగుల సంక్షేమం
అనంతపురం: ఒకే దఫా రెండు లక్షల పింఛన్లు దివ్యాంగులకు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ‘అనంత’ ముఖ్య అతిథిగా, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచి పెట్టారు. అనంతరం విలేకరులతో ‘అనంత’ మాట్లాడుతూ దొంగ పింఛన్లు తీసుకున్నారంటూ దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే దివ్యాంగులకు దన్నుగా నిలిచారని కొనియాడారు. వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లలో కోత వేయాలని, కొందరు దివ్యాంగులకు అన్యాయం చేయాలని చూసిందని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన దివ్యాంగులకు అభినందనలు తెలిపారు. అదే స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని సూచించారు.
దివ్యాంగులపై దృష్టి పెట్టాలి
దివ్యాంగుల సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు వైకల్యం కలిగినా అన్ని రంగాల్లోనూ దీటుగా రాణిస్తున్నారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఉన్నారని ప్రశంసించారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంలుగా పనిచేసిన సమయంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెన్షన్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జానీ, 48వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ రాజేష్, అర్బన్ అధ్యక్షుడు కాళేశ, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు టి.వీరాపురం ఆంజనేయులు, శింగన మల అధ్యక్షుడు భరత్‌కుమార్ రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు సాకే ఆంజనేయులు, కళ్యాణదుర్గం దొణస్వామి, బెనకల్లు రామాంజినేయులు, ఫకృద్దీన్, జి. శ్రీనివాసులు, నారాయణ స్వామి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అప్పట్లో ఎన్నో కార్యక్రమాల అమలు
చంద్రబాబు పింఛన్లలో కోత పెట్టి అన్యాయం చేయాలని చూశారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ ఎమ్మెల్యే ‘విశ్వ’


