వర్షంలో నిలబడి నిరసన తెలుపుతున్న నేత కార్మికులు
నేతన్నల నిరసన
నారాయణవనం: తుపాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన సాయంలోనూ వివక్ష చోటుచేసుకోవడంతో తిరుపతి జిల్లా నారాయణవనంలోని చేనేత కార్మికులు బుధవారం వర్షంలో నిలబడి నిరసన తెలిపారు. తుపాను ప్రభావంతో మగ్గం గుంతల్లో నీరు చేరడం, నేయడానికి వాతావరణం సహకరించక ఉపాధిని కోల్పోయిన నేత కార్మికులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యం, పప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను అందజేసింది.
మండలంలో నారాయణవనం, కైలాసకోన వీవర్స్ కాలనీ, తుంబూరు, పాలమంగళం ఉత్తర, దక్షిణపుకండ్రిగ గ్రామాల్లో చేనేత కుటుంబాలు వారు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారనే కారణం చూపుతూ టీడీపీ నేతలు వందకు పైగా చేనేత కుటుంబాలకు సాయం అందకుండా చేశారు. ప్రభుత్వ సాయంలో అధికారులు పక్షపాతం చూపారని కార్మికులు వాపోయారు. నెల రోజులు దాటుతున్నా సాయం అందలేదని వాపోతున్నారు. సాయంలో ప్రత్యక్ష జోక్యం లేదని రెవెన్యూ, సచివాలయ అధికారులు సమాధానం దాటవేస్తున్నారని నేత కార్మికులు జయరామయ్య, దేశయ్య, పెరుమాళ్, జయశంకర్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.


