నగర ముఖచిత్రం మారింది. నయా బల్దియాకు దారి పడింది. శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో సదరు స్థానిక సంస్థలకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్‌ఎంసీ çపరిధిలోకొచ్చాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ ఏ స్థానికసంస్థ రికార్డులు స్వా«దీనం చేసుకోవాలో పేర్కొంటూ.. తక్షణమే ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్థానిక సంస్థల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఈ స్థానికసంస్థల రికార్డుల్ని స్వా«దీనం చేసుకోవడంతోపాటు మినిట్స్ బుక్స్ నిలిపివేయాలని, ప్రస్తుత బ్యాంకు ఖాతాలను జీహెచ్‌ఎంసీ బ్యాంక్ ఖాతా (అకౌంట్ నెంబర్ (52082155599)కు బదిలీ చేయాలని ఆయన ఆదేశించారు.
బోర్డుల మార్పు
27 స్థానిక సంస్థల కార్యాలయాలపై జీహెచ్‌ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పాటు దిగువ వివరాలు సమర్పించాలని సూచించారు.
స్థానిక సంస్థ ప్రొఫైల్.
మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాల జాబితా.
స్థిర, చర ఆస్తుల వివరాలు
బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు
ట్యాక్స్‌లు, నాన్ ట్యాక్స్‌లకు సంబంధించి. డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ వివరాలు.
అమలవుతున్న స్కీమ్‌లు
పనులు, సామగ్రికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు
గత మూడేళ్లలో జారీ చేసిన భవననిర్మాణ, లే ఔట్‌ల అనుమతులు.
వీటిని సంబంధిత ప్రొఫార్మా రూపంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు వెంటనే సమరి్పంచాలని ఆదేశించారు.
ఈ విలీన ప్రక్రియలో సహకరించాల్సిందిగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరారు. ఈ పనులు ఈ నెల 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పర్యవేక్షణాధికారులుగా ఆయా జోనల్ కమిషనర్లకు బాధ్యతలప్పగించారు. ఓఆర్‌ఆర్ వరకు, ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణతో నగర అభివృద్ధి ప్రణాళికలు సమగ్రంగా అమలు చేసేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వివరాలు ఇవ్వాలి
ఆయా ప్రొఫార్మాల మేరకు సదరుస్థానిక సంస్థల్లో నివాసాలు, వార్డులు, స్లమ్స్, జనాభా, గత మూడేళ్లలో ఆదాయం(గ్రాంట్స్‌తో సహ), వ్యయం, రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వివరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, మార్కెట్లు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు పరిశ్రమలు, చెత్త డంపింగ్ ప్రాంతాలు, భవనాలు, ఖాళీ ప్రదేశాలు, పార్కులు, స్థానికసంస్థకు చెందిన వాహనాలు, ఫరి్నచర్, దుకాణాలు, సెల్ప్‌హెల్ప్ గ్రూప్‌లు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ అసోసియేషన్లు, ఎన్జీవోలు, ఇటీవల నియమించిన ఔట్‌సోర్సింగ్ కారి్మకులు తదితరాలు. సంవత్సర క్యాష్‌బుక్స్, పేబిల్స్ పరిశీలించాలని సూచించారు.
విలీనమిలా..
రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న విలీన నిర్ణయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. విస్తీర్ణం, జనాభా పెరుగుదల: దీంతో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా దాదాపు 1.3 కోట్లు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు.
ఇన్‌చార్జి డీసీలుగా
విలీన స్థానిక సంస్థల కమిషనర్లు
విలీనమైన స్థానిక సంస్థల కమిషనర్లనే జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్లుగా నియమించారు. మణికొండకు మాత్రం జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్ (హెల్త్) జె.శంకర్‌ను నియమించారు. ఈమేరకు ఆర్‌వీ కర్ణన్ విడిగా ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
ఇక డీలిమిటేషన్
విలీనం పూర్తికావడంతో ఇక డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈమేరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


