సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్‌లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?..
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్‌డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు.
ఏంటా కొత్త రూల్స్.. ?
FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్‌లైన్స్ తమ షెడ్యూల్‌లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది.
ఇలాగే ఇంకొన్ని గంటలు
రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్‌లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది.
ఎఫ్‌డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.


