రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
4 వికెట్లతో భారత్ పరాజయం
కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా
వైజాగ్‌లో శనివారం చివరి వన్డే
విరాట్ కోహ్లి తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్‌లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్‌పూర్‌లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేశారు. మార్క్‌రమ్, బ్రెవిస్, బ్రెట్‌కీ బ్యాటింగ్ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్‌తో భారత్ నుంచి మ్యాచ్ చేజారింది.
రాయ్‌పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్ మూడో వికెట్‌కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు.
అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్‌రమ్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్‌కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది.
భారీ భాగస్వామ్యం...
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... బర్గర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు.
ఇద్దరిలో ముందుగా రుతురాజ్ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్... మహరాజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. యాన్సెన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు బాష్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు.
50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్ అవుట్ కాగా... యాన్సెన్ ఓవర్లో సింగిల్‌తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టగలిగింది.
బ్రెవిస్ దూకుడు...
దక్షిణాఫ్రికా టాప్–5లో డికాక్ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత మార్క్‌రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన మార్క్‌రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్‌రేట్‌తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్ ఆట స్వరూపాన్ని మార్చాడు.
కుల్దీప్, హర్షిత్ బౌలింగ్‌లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్‌రేట్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్‌కే నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బాష్ (బి) యాన్సెన్ 22; రోహిత్ (సి) డికాక్ (బి) బర్గర్ 14; కోహ్లి (సి) మార్క్‌రమ్ (బి) ఎన్‌గిడి 102; రుతురాజ్ (సి) జోర్జి (బి) యాన్సెన్ 105; రాహుల్ (నాటౌట్) 66; సుందర్ (రనౌట్) 1; జడేజా (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్: బర్గర్ 6.1–0–43–1, ఎన్‌గిడి 10–1–51–1, యాన్సెన్ 10–0–63–2, మహరాజ్ 10–0–70–0, బాష్ 8–0–79–0, మార్క్‌రమ్ 5.5–0–48–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 110; డికాక్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 8; బవుమా (సి) హర్షిత్ (బి) ప్రసిధ్ 46; బ్రీట్‌కే (ఎల్బీ) (బి) ప్రసిధ్ 68; బ్రెవిస్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 54; జోర్జి (రిటైర్డ్‌హర్ట్) 17; యాన్సెన్ (సి) రుతురాజ్ (బి) అర్‡్షదీప్ 2; బాష్ (నాటౌట్) 29; మహరాజ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–54–2, హర్షిత్ 10–0–70–1, ప్రసిధ్ 8.2–0–85–2, సుందర్ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్ 10–0–78–1.
11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.
34 కోహ్లి తన వన్డే కెరీర్‌లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.
44 ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.
3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్... 2001 అక్టోబర్ 5న జొహనెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.
2 రుతురాజ్ గైక్వాడ్ టి20 (2023 నవంబర్ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్), వన్డే (2025 డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్‌లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్ ఓడిపోయింది.
2 వన్డేల్లో భారత్‌పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది.


