రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్ రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్- రష్యా 23వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశి థరూర్ భారత్ - రష్యా మధ్య మైత్రి ఎంతో ముఖ్యమైనదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్న సమయం నుంచే రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆకాలం నుంచే రెండు దేశాలు పరస్పర సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయి. కాగా రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ పర్యటనపై మాట్లాడారు.
"రష్యా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది, అదే విధంగా అమెరికా, చైనాలతోనూ ద్వైపాక్షిక బంధాల్ని కొనసాగించాలి. భారత ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు" అని శశి థరూర్ అన్నారు. ఈ మూడు దేశాలతో భారత్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూతో పాటు అమెరికా పలు ఆంక్షలు విధించి ఏకాకిని చేసే యత్నం చేశాయి. భారత్ సైతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే వీటిని భారత్ లెక్కచేయకుండా మాస్కోతో మైత్రిని కొనసాగించింది. తన చిరకాల మిత్రునికి అండగా నిలిచింది.
రష్యా నుంచి భారత్ రక్షణ రంగ సామాగ్రి , పెట్రోలియం, ఎరువులు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా జౌషదాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు మాస్కోకు ఎగుమతి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.


