ఢిల్లీ: సంచార్ సాథీ యాప్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్‌లో ప్రీ-ఇన్‌స్టాలేషన్ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాలేషన్ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. సంచార్ సాథీ యాప్ ప్రీ ఇనస్టాలేషన్‌ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ని ప్రీ–ఇన్‌స్టాల్ చేయాలంటూ హ్యాండ్‌సెట్ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్‌ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్ చేసుకోవద్దు. రిజిస్టర్ చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.
మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్‌స్టాల్ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలని హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. సంచార్ సాథీ యాప్‌కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.


