breaking news
Sanchar Saathi
-
వెనక్కి తగ్గిన ‘సాథీ’!
ఉద్దేశాలు మంచివైనప్పుడు దాపరికాలు అవసరం లేదు. జనానికి మేలు చేయటమే ధ్యేయమైనప్పుడు చాటుమాటు చర్యలు సరికాదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ మూణ్ణెల్లలో ఫోన్లలో ఉండితీరాలంటూ కేంద్రం మొబైల్ ఉత్పత్తిదారులకు మొన్న శుక్రవారం చడీచప్పుడూ లేకుండా ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదం కావటం ఇందువల్లే. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలకు జడిసి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న, దిగుమతవుతున్న ఫోన్లకు వర్తించటంతోపాటు ఇప్పటికే వినియోగదారుల దగ్గరున్న ఫోన్లకు సాఫ్ట్వేర్ ద్వారా ఈ యాప్‌ను చేరేయాలని టెలికమ్యూనికేషన్ల విభాగం మూడు రోజుల క్రితం మొబైల్ ఉత్పత్తిదారుల్ని ఆదేశించింది. తాజాగా అది తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. పౌరుల శ్రేయస్సును ఆశించి, వారు మోసగాళ్ల బారిన పడకుండా చూసేందుకు ఇది రూపొందించామనీ, ఇందులో గూఢచర్యం లేదా ఫోన్ సంభాషణల పర్యవేక్షణ ఉద్దేశం లేనేలేవనీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంజాయిషీ ఇచ్చారు. దాదాపు కోటిన్నరమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారనీ, 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామనీ, అపహరించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడ కనిపెట్టి 7 లక్షల సెట్లను వాటి యజమానులకు అందించా మనీ సింధియా చెబుతున్నారు. ఈ గణాంకాలతో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ యాప్ ద్వారా ప్రయోజనాలు వెల్లువెత్తుతుంటే ఆ మాటే చెప్పి, మరింతమందిని ప్రోత్స హించవచ్చు. తదుపరి చర్యలు అవసరమనుకుంటే వెల్లడించవచ్చు. ఇదేం లేకుండా రహస్య చర్య ఆంతర్యమేమిటి? దాదాపు నలభయ్యేళ్ల క్రితం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పోస్టల్ బిల్లు’ తీసుకొచ్చి నప్పుడు జరిగిందేమిటో పాలకులు గ్రహించివుంటే వ్యక్తిగత గోప్యతను పౌరులు ఎంత ప్రాణప్రదంగా పరిగణిస్తారో అర్థమై ఉండేది. కనీవినీ ఎరుగని స్థాయిలో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని, తిరుగులేదనుకున్నవేళ పౌరులకు తెలియకుండా వారి ఉత్తరా లను చదివేందుకుద్దేశించిన బిల్లు తీసుకొచ్చి ఆయన అభాసుపాలయ్యారు. జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. జాతీయ భద్రత లేదా సముచిత ప్రజాప్రయోజనం ఉన్నదని ప్రభుత్వం భావిస్తే గోప్యత నియంత్రణకు తగిన చట్టం తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు ప్రజల్లో, పార్లమెంటులో విస్తృత చర్చ జరుగుతుంది. ఇవేమీ లేకుండా ఒక నోటీసు ద్వారా పనికానిచ్చేద్దామనుకోవటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా?అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన దగ్గర డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. క్రయవిక్రయాలు, చెల్లింపులు, వసూళ్లు, ఆన్లైన్ నమోదులు ముమ్మర మయ్యాయి. వాటితోపాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకోవటానికీ, పోగొట్టుకున్న ఫోన్లు పొందేందుకూ ‘సంచార్ సాథీ’ తోడ్పడటం నిజమే కావొచ్చు. కానీ గుప్పెడుమంది నేరగాళ్లను పట్టుకోవడానికి కోట్లాదిమందిని నిఘా నీడలోకి తెస్తామనటం ఏం తర్కం? ఉత్పత్తిదారులకు తప్పనిసరంటూ ఆదేశాలిచ్చి, ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చని చెప్పడంలో మర్మమేమిటి?వ్యక్తిగత గోప్యత విషయంలో పౌరులకు ఎంత పట్టింపు ఉంటుందో నిత్యజీవితంలో చూస్తుంటాం. తల్లిదండ్రులు తమ ఫోన్లు గమనిస్తున్నారంటే పిల్లలకు కోపం. ప్రాణ స్నేహితుడైనా చాటుగా ఫోన్ చూస్తే సహించరు. భార్యాభర్తలే ఒకరి ఫోన్లు మరొకరు చూశారని తెలిస్తే దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ నిఘాకు అవకాశమిచ్చే యాప్‌ను జనం అంగీకరించగలరా? కాల్స్ వినేందుకూ, ఎస్సెమ్మెస్‌లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు వగైరాలన్నిటినీ చూసేందుకూ... ఆఖరికి మనకు తెలియకుండా కెమెరా వినియోగానికి కూడా ఈ యాప్ అవకాశమిస్తుందన్నది నిపుణుల మాట. బహుశా ‘1984’ రచయిత జార్జి ఆర్వెల్ కూడా ఇంత చేటు నిఘా ఊహించలేదు. ఏదేమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది వివేకవంతమైన చర్య. -
సంచార్ సాథీ యాప్.. కేంద్రం యూటర్న్
ఢిల్లీ: సంచార్ సాథీ యాప్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్‌లో ప్రీ-ఇన్స్టాలేషన్ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్స్టాలేషన్ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఇవాళ(డిసెంబర్ 3, బుధవారం) ప్రకటించింది.సంచార్ సాథీ యాప్ ప్రీ ఇనస్టాలేషన్‌ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా, కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ని ప్రీ–ఇన్స్టాల్ చేయాలంటూ హ్యాండ్సెట్ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.Government removes mandatory pre-installation of Sanchar Saathi AppThe Government with an intent to provide access to cyber security to all citizens had mandated pre-installation of Sanchar Saathi app on all smartphones. The app is secure and purely meant to help citizens from…— PIB India (@PIB_India) December 3, 2025సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్‌ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్ చేసుకోవద్దు. రిజిస్టర్ చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలని హ్యాండ్సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. సంచార్ సాథీ యాప్‌కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. -
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ.. -
విమర్శల వెల్లువ.. సంచార్ సాథీపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: సంచార్ సాథీ యాప్‌పై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కేంద్రం స్పందించింది. సైబర్ మోసాలను నిరోధించేందుకు యాప్ తీసుకొస్తే, ప్రతిపక్షాలు గొంతెందుకు చించుకుంటున్నాయి? అని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రశ్నించారు. ఈ క్రమంలో.. సైబర్ఫ్రాడ్ నిరోధించేందుకే యాప్ రూపకల్పన జరిగిందని, అది 100కు వంద శాతం సురక్షితమైందని ప్రకటన చేశారు. సైబర్ ఫ్రాడ్ నిరోధించేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చాం. అది పూర్తిగా సురక్షితం. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే ఇది అన్నింటిలాంటి యాపే. కచ్చితం ఏం కాదు. దీనిని ఉపయోగించడమా?.. లేదా?.. ఆక్టివేట్ చేయడమా ? డీయాక్టివేట్ చేయడమా ? అనేది వినియోగదారుల ఇష్టం. మా పని కేవలం యాప్‌ను అందరికీ పరిచయం చేయడం వరకే. ఇష్టం లేకుంటే వినియోగదారులు యాప్ డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్రం తరఫున టెలికాం మంత్రి స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ యాప్‌ను తప్పనిసరిగా ఫోన్ల తయారీ సమయంలోనే ఇన్స్టాల్ చేయాలని.. అది యూజర్లు తొలగించడానికి కూడా వీలుగా ఉండకూడదని ఆదేశాలు జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంపై యాపిల్ లాంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఇటు వ్యక్తిగత గోప్యత విషయంలోనూ సందేహాలు వెలువెత్తాయి. అదే సమయంలో.. ప్రతీ పౌరుడి మొబైలోకి తొంగిచూడడం సరికాదని, డాటా చోర్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమంటూ విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటనతో ఓ క్లారిటీ ఇచ్చినట్లైంది. -
సంచార్ సాథీ యాప్.. భగ్గుమన్న విపక్షాలు
సాక్షి, ఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. అన్ని ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సైబర్ నేరాలను నిరోధించేందుకు పౌరుల భద్రత కోసం సంచార్ సాథీ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం. -
సంచార్ సాథీ.. ‘వద్దు ప్లీజ్!’
దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్న వేళ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం కోసం కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా విక్రయించే అన్ని స్మార్ట్ఫోన్లలో.. ప్రభుత్వ యాప్ అయిన సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ(డాట్) అన్ని ప్రైవేట్‌గా మొబైల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్స్టాల్ చేయాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది.దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. అయితే, ప్రభుత్వ యాప్ ఉండటం పట్ల కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు గోప్యతా హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. తమతో సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంపై మొబైల్ తయారీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యాపిల్, శామ్సంగ్, షియోమీ వంటి సంస్థలు యాప్‌పై స్పందించలేదు. సెల్ఫోన్లను విక్రయించడానికి ముందే ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్స్టాల్ చేయడాన్ని సాధారణంగా యాపిల్ కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇది యాపిల్ సంస్థతో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సేథీ యాప్‌ను డిలీట్ చేయలేని విధంగా తప్పనిసరి చేయడం అంటే గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది వినియోగదారుల స్వేచ్ఛను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై డిజిటల్ హక్కుల సంఘాలు సైతం స్పందిస్తూ.. నెటిజన్లపై ఇది అధిక నియంత్రణగా అభివర్ణిస్తున్నారు. వినియోగదారులు తమ పరికరంపై పూర్తి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడనుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కాగా, సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫోన్లలో ఈ యాప్ ఉండటం వల్ల అది ఫోన్ ట్యాపింగ్‌కు కూడా సహాయపడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో యాప్ విషయంలో కేంద్రం ఏదైనా సవరణ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. సైబర్ సెక్యూరిటీ అంటే?స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీ (Cyber Security) అంటే మీ మొబైల్ పరికరాన్ని హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, డేటా లీక్‌ల నుండి రక్షించడం. ఇది వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఫోటోలు, కాంటాక్టులు వంటి డేటా సురక్షితంగా ఉండేందుకు కీలకం.సెక్యూరిటీ చిట్కాలుబలమైన పాస్వర్డ్లు, బయోమెట్రిక్ లాక్‌లు (ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ) వాడటం ముఖ్యం. మల్టీ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (MFA) ఉపయోగించి బ్యాంకింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను సేఫ్‌గా చూసుకోండి.సాఫ్ట్వేర్ అప్డేట్స్ క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేయండి.పాత వెర్షన్లు హ్యాకర్లకు సులభంగా లక్ష్యం అవుతాయి.పబ్లిక్ Wi-Fi వాడేటప్పుడు VPN ఉపయోగించండి.అనుమానాస్పద లింకులు లేదా యాప్‌లు డౌన్లోడ్ చేయకండి.యాంటీ-వైరస్ లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్‌లు వాడటం ద్వారా మాల్వేర్ దాడులను నివారించవచ్చు.ఎందుకు ముఖ్యమైంది?స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు వాలెట్, వర్క్‌స్టేషన్, వ్యక్తిగత అసిస్టెంట్‌లా మారాయి. బ్యాంకింగ్, ఆరోగ్య సమాచారం, వ్యక్తిగత ఫోటోలు ఇవన్నీ ఒకే పరికరంలో ఉండటం వల్ల సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారాయి. సైబర్ క్రైమ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఫొటోలు మార్ఫింగ్ చేయడం పెరిగింది.అయితే ఈ సంచార్ సాథి యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించింది. అప్పటి నుంచి.. ఈ సంచార్ సాథి యాప్ ద్వారా 37 లక్షలకు పైగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. ఈ యాప్ ఇప్పటికే పోగొట్టుకున్న 7 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేయడంలో సహాయపడింది. ఇక, ఫోన్లో ఈ యాప్ ఉండటం వల్ల దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కేంద్ర రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేయవచ్చు. -
మొబైల్స్‌లో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్త హ్యాండ్‌సెట్స్‌లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్స్టాల్ చేయాల్సిందేనని నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. ఇప్పుడున్న ఫోన్లనూ అప్డేట్ చేయాలి .. ఇప్పటికే భారత్‌లో తయారైనవి, విక్రేతల దగ్గర ఉన్నవాటికి సంబంధించి తయారీ సంస్థలు, దిగుమతిదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్‌ను అందించాల్సి ఉంటుందని డాట్ పేర్కొంది. ఈ ఆదేశాల అమలు తీరుతెన్నుల గురించి, ఉత్తర్వులు వెలువడిన 120 రోజుల్లో అన్ని సంస్థలు, దిగుమతిదారులు కాంప్లయెన్స్ రిపోర్టును సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, ఒప్పో, షావోమీలాంటి దిగ్గజాలు భారత్‌లో హ్యాండ్సెట్స్ని తయారు చేస్తున్నాయి. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్) దురి్వనియోగంపై సందేహాలుంటే ఫిర్యాదు చేసేందుకు, మొబైల్ డివైజ్‌లలోని ఐఎంఈఐలు సిసలైనవేనని నిర్ధారించుకునేందుకు సంచార్ సాథీ ఉపయోగపడుతుంది. 15 అంకెల ఐఎంఈఐ నంబరు సహా మొబైల్ ఫోన్‌ని గుర్తించేందుకు ఉపయోగపడే దేన్నైనా మార్చివేయడాన్ని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్షలాంటివి ఉంటాయి.


