కొత్త హ్యాండ్‌సెట్స్‌లో ప్రీ–ఇన్‌స్టాల్ చేయాల్సిందే
తయారీ సంస్థలకు డాట్ ఆదేశం 90 రోజుల గడువు
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్త హ్యాండ్‌సెట్స్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్‌స్టాల్ చేయాల్సిందేనని నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు.
ఇప్పుడున్న ఫోన్లనూ అప్‌డేట్ చేయాలి ..
ఇప్పటికే భారత్‌లో తయారైనవి, విక్రేతల దగ్గర ఉన్నవాటికి సంబంధించి తయారీ సంస్థలు, దిగుమతిదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాప్‌ను అందించాల్సి ఉంటుందని డాట్ పేర్కొంది. ఈ ఆదేశాల అమలు తీరుతెన్నుల గురించి, ఉత్తర్వులు వెలువడిన 120 రోజుల్లో అన్ని సంస్థలు, దిగుమతిదారులు కాంప్లయెన్స్ రిపోర్టును సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, ఒప్పో, షావోమీలాంటి దిగ్గజాలు భారత్‌లో హ్యాండ్‌సెట్స్‌ని తయారు చేస్తున్నాయి. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నంబర్) దురి్వనియోగంపై సందేహాలుంటే ఫిర్యాదు చేసేందుకు, మొబైల్ డివైజ్‌లలోని ఐఎంఈఐలు సిసలైనవేనని నిర్ధారించుకునేందుకు సంచార్ సాథీ ఉపయోగపడుతుంది. 15 అంకెల ఐఎంఈఐ నంబరు సహా మొబైల్ ఫోన్‌ని గుర్తించేందుకు ఉపయోగపడే దేన్నైనా మార్చివేయడాన్ని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్షలాంటివి ఉంటాయి.


