డౌన్‌లోడ్స్‌లో ప్రపంచంలో మనమే టాప్
మొబైల్ అంటేనే యాప్స్. ఉత్పాదకత, వినోదం, సోషల్ మీడియా, విద్య, యుటిలిటీ, ఈ–కామర్స్.. అవసరం ఏదైనా మొబైల్ అప్లికేషన్స్‌తోనే (యాప్స్) మన జీవితం ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 14,900 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్ నమోదయ్యాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. డౌన్‌లోడ్స్‌తోపాటు వినియోగంలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది.

ఐఓఎస్, గూగుల్ ప్లే స్టోర్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి వివిధ రకాల యాప్స్‌నకుగాను 2,84,000 డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ఫీచర్స్, కంటెంట్, సేవల కోసం మొబైల్ యూజర్లు ఈ యాప్స్‌నకు నిమిషానికి రూ.2.9 కోట్లు ఖర్చు చేశారు. తొలిసారిగా గేమ్స్ కంటే యాప్స్‌పై అధికంగా వ్యయం చేశారని అమెరికాకు చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్, యాప్ డేటా ఎనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాప్‌ల కథాకమామీషు ఎలా ఉందో చూద్దాం..


