నో టెన్ష‌న్‌.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు | Why India Hides Strategic Oil Reserves In Mountain Underground Caves, Amid Global Supply Disruptions And Middle East Tensions | Sakshi
Sakshi News home page

భూగర్బ రహస్య గుహల్లో మెట్రిక్‌ టన్నుల చమురు నిల్వలు

Mar 13 2026 2:35 PM | Updated on Mar 13 2026 3:05 PM

Why India Hides Strategic Oil Reserves in Mountain Caves

భారత చమురు భద్రతకు రక్షాకవచాలుగా నిలుస్తున్న భూగర్బ నిల్వ కేంద్రాలు

విశాఖపట్నంలో భూగర్బ రహస్య గుహల్లో మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు

కర్ణాటక, తమిళనాడులోనూ నిల్వలు

పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్‌ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్‌ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్‌ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.

భారత్‌ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్‌జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్‌ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్‌ వంటి దేశాలు ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.

మూడు చోట్ల మహా గుహలు! 
చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్‌లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.

ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్‌ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్‌ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్‌ చేసుకుంది.

అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్‌ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్‌ బ్యారెళ్ల చమురును భారత్‌ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్‌ కొనేసింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.

అరకిలోమీటర్‌ లోతులో..
కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్‌ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్‌లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్‌లో మరో దానిని నిర్మించనున్నారు.

చ‌ద‌వండి: సిలిండ‌ర్లు దాచారో.. జైలుకే!

భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్‌లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్‌ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్‌ ఈ అండర్‌గ్రౌండ్‌ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement