దక్షిణాఫ్రికాతో ఓటమితో ఆట మారింది
కెప్టెన్ సూర్యకుమార్ వ్యాఖ్య
ముుంబై: భారత్‌కు టి20 వరల్డ్ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్ మాటల్లోనే...
కెప్టెన్సీ, వరల్డ్ కప్ గెలిపించడంపై...
రోహిత్ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్‌ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్‌గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్ గంభీర్‌తో మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది.
2024 ప్రపంచకప్‌తో పోలిక...
అప్పటికంటే మా బ్రాండ్ క్రికెట్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం.
మర్చిపోలేని క్షణాలు...
వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్‌గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్ పట్టిన క్యాచ్ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్ చేసి మా వీడియో అనలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.


