జాక్‌పాట్‌ కొట్టిన ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ | Who Is James Coles, The Most Expensive Player Of The Hundred 2026 Auction | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ కొట్టిన ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌

Mar 12 2026 9:06 PM | Updated on Mar 13 2026 10:14 AM

Who Is James Coles, The Most Expensive Player Of The Hundred 2026 Auction

తొలిసారి నిర్వహించిన హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్‌పాట్‌ కొట్టాడు. క్రికెట్‌ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ను లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 

75 వేల పౌండ్ల బేస్‌ప్రైజ్‌ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్‌ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌, మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్‌ రౌండ్ల అనంతరం లండన్‌ స్పిరిట్‌ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.

లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ కమ్‌ డాషింగ్‌ బ్యాటర్‌ అయిన కోల్స్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో అతను టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్‌ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్‌.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

చిన్న వయసులోనే 51 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ కలిగిన కోల్స్‌.. 82 ఇన్నింగ్స్‌ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్‌.. ఈ ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. 

హండ్రెడ్‌ లీగ్‌లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్‌.. ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన కోల్స్‌.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్‌ లయన్స్‌ తరఫున భారత్‌, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్‌ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. 

హండ్రెడ్‌ లీగ్‌లో జాక్‌పాట్‌ కొట్టడంతో, విదేశీ లీగ్‌ ఫ్రాంచైజీల కన్ను కోల్స్‌పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 వేలంలో కోల్స్‌ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్‌ లీగ్‌లో కోల్స్‌ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్‌ వేలంలో కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

హెండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు))  ఎంపిక చేసుకుంది.

ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement