ఎంఎస్ ధోని (PC: BCCI)
గత పద్దెమినిదేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా.. ఆ జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక నలభై నాలుగేళ్ల వయసులోనూ తలా ఐపీఎల్-2026 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.
ఎనిమిదో స్థానంలో
టోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో ధోని పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గా ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని.. 135కు పైగా స్ట్రైక్‌రేటుతో 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు.
ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చెన్నై జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం అర్థం లేని విషయం అని అభిప్రాయపడ్డాడు.
ధోని అలా బ్యాటింగ్ చేయడంలో అర్థం లేదు
‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఎంఎస్ ధోని (MS Dhoni) సొంతం. సీఎస్‌కే జట్టులోనూ ఎవరూ ఆయనకు సాటిరారు. అలాంటి ధోని ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థం లేదు.
ఒకవేళ ఆయన కేవలం ఐదు లేదంటే పది బంతుల్లోనే పరుగులు రాబట్టగలిగినపుడు.. కనీసం 25 నుంచి 30 బంతులు ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోని మరీ లోయర్ ఆర్డర్‌లో రావడం ఏమాత్రం సరికాదు’’ అని పుజారా జియోస్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
విశ్వసనీయత ఎక్కువ
అదే విధంగా సీఎస్‌కేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను గతంలో చెన్నైకి ఆడాను. ఆ జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారు. ఆటగాడిగా మన నుంచి ఫ్రాంఛైజీ ఏం కోరుకుంటుందో ప్రతీ ఆటగాడికి తెలసు.
సీఎస్‌కే ఫ్రాంఛైజీకి విశ్వసనీయత ఎక్కువ. ఫ్రాంఛైజీ పట్ల ఆటగాళ్లకు అభిమానం మెండు. ధోని మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఆ జట్టుతో చాన్నాళ్లు కొనసాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆ జట్టులో మార్పులు జరుగుతున్నాయి. వెటరన్ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారు’’ అని పుజారా పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2026 తొలి విడత షెడ్యూల్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌కే మార్చి 30న రాజస్తాన్ రాయల్స్‌తో, ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్రిల్ 5న ఆర్సీబీతో, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్-2026 సీఎస్‌కే జట్టు
ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (RR నుండి ట్రేడింగ్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్✈️, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్✈️, నాథన్ ఎల్లిస్✈️, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్✈️, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్✈️, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్✈️, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ✈️, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్✈️
చదవండి: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు


