టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి.
యువీదే కీలక పాత్ర
ఇక ధోని కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచకప్ టోర్నీలు గెలిచిన టీమిండియాలో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఈ ఐసీసీ ఈవెంట్లో 363 పరుగులు చేయడంతో పాటు యువీ పదిహేను వికెట్లు కూడా తీశాడు.
అదే సమయంలో యువీ క్యాన్సర్ బారిన పడినట్లు తేలగా చాన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని రీఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
తన కుమారుడి కెరీర్ నాశనమైందని..
ఈ పరిణామాల నేపథ్యంలో యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఎల్లప్పుడూ ధోనిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందని.. అతడే జట్టులో యువీకి స్థానం లేకుండా చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. యువీ మీద అసూయతోనే ధోని ఇలా చేశాడని ఆరోపించాడు.
ఈ క్రమంలో యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తాజాగా స్పందించాడు. యువీ విషయంలో ధోని ఏనాడూ వివక్ష చూపలేదని.. అతడిని జట్టు నుంచి తప్పించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు.
ధోని ఏనాడూ చెప్పలేదు..
ఈ మేరకు విక్కీ లల్వాణీ షోలో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ కమిటీ సమావేశాలు.. లేదంటే విదేశీ పర్యటనలు.. అదీ కాదంటే మ్యాచ్‌ల సందర్భంగా .. ఇలా ఎప్పుడూ కూడా.. ఏ సందర్భంలోనూ యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించమని మహేంద్ర సింగ్ ధోని ఏనాడూ చెప్పలేదు.
నా మాటలను రికార్డు చేసి పెట్టండి. ధోని ఏనాడూ ఏ ఆటగాడి గురించి చెడుగా చెప్పలేదు. అతడికి సెలక్షన్ కమిటీ నిర్ణయంపై పూర్తి నమ్మకం ఉండేది’’ అని యువీ విషయంలో నాడు సెలక్టర్లదే తుది నిర్ణయం అని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు. ఇక ఓ తండ్రిగా యోగ్‌రాజ్ ఆవేదనలో తప్పు లేదని.. అయితే, కుమారుడి మీద ప్రేమతో మరొకరిని నిందించడం తగదని హితవు పలికాడు.
చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’


