శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌ | Not Sanju Samson, AB de Villiers Names Deserving T20 World Cup POTM Winner | Sakshi
Sakshi News home page

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

Mar 12 2026 1:42 PM | Updated on Mar 12 2026 1:59 PM

Not Sanju Samson, AB de Villiers Names Deserving T20 World Cup POTM Winner

సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ వేదిక‌గా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ చారిత్రత్మ‌క విజ‌యంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ది కీల‌క పాత్ర.

వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌తో పాటు సెమీస్‌, ఫైన‌ల్లోనూ సంజూ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జ‌ట్టులోనే లేక‌పోయిన శాంస‌న్‌.. ఆ త‌ర్వాత వ‌రుస మ్యాచ్‌ల‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్‌ కేవ‌లం ఐదు మ్యాచ్‌ల‌లోనే 321 ప‌రుగులు చేశాడు.

ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.

ఈ మెగా ఈవెంట్‌లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.  ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ నేప‌థ్యంలోనే బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేద‌ని ఏబీడీ అన్నాడు.

"సంజూ శాంస‌న్‌, బుమ్రాలో ఎవ‌రు ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీ అన్న‌ది నిర్ణ‌యించ‌డం చాలా కష్టం. ఈ టోర్నీలో  బుమ్రా అత్య‌ధిక వికెట్లు తీశాడు. కాబ‌ట్టి అత‌డు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వ‌ర‌కు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అత‌డు వేసిన కొన్ని కీల‌కమైన స్పెల్‌లు భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాయి.

సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అత‌డొక్క‌డే వేరే గ్ర‌హంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అత‌డు భార‌త క్రికెట్‌కు అత‌డొక విలువైన ఆస్తి" అని డివిలియ‌ర్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement