గురుశిష్యులకు అరుదైన గౌరవం! | Dravid To Receive BCCI Lifetime Achievement Award-Gill Named Cricketer Of Year | Sakshi
Sakshi News home page

గురుశిష్యులకు అరుదైన గౌరవం!

Mar 12 2026 11:48 AM | Updated on Mar 12 2026 12:03 PM

Dravid To Receive BCCI Lifetime Achievement Award-Gill Named Cricketer Of Year

టీమిండియా మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అరుదైన గౌరవం అందుకోనున్నాడు. క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పేరున్న సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును రాహుల్‌ ద్రవిడ్‌ సొంతం చేసుకోనున్నాడు. మార్చి 15న ఢిల్లీ వేదికగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక జరగనుంది.

ఈ వేడుకలోనే రాహుల్‌ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. కాగా ఇదే వేడుకలో భారత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకోనున్నాడు. ఇక దేశవాలీ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌గా గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆయుశ్‌ మాత్రే ‘లాలా అమర్‌నాథ్‌’ అవార్డు అందుకోనున్నాడు. ఇక భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ కూడా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనుంది.

భారత​ క్రికెట్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ స్థానం ప్రత్యేకమైనది. సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సంయుక్తంగా స్థానం సంపాదించిన ద్రవిడ్‌ ‘ది వాల్‌’గా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా పేరు పొందిన ద్రవిడ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన ద్రవిడ్‌.. 2001లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌ అవతారమెత్తిన ద్రవిడ్‌.. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కప్‌ గెలిచిన జట్టులో శుబ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షాలు సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు గురువు శిక్షణలో అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన గిల్‌ ఇప్పుడు గురువుతో కలిసి ఒకే వేదికపై అవార్డు అందుకోబోతుండడం విశేషం.

ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లోనూ తనదైన మార్క్‌ చూపించాడు. ద్రవిడ్‌ హయాంలోనే టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2024లో అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌‌ విజేతగా నిలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

ఇక శుబ్‌మన్‌ గిల్‌ చివరిగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాడు. కెప్టెన్‌ అయిన తర్వాత ఒత్తిడిలో పడిపోయిన గిల్‌ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో టీ20 జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.

చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement