‘గేమ్‌ప్లాన్‌ ఎవడిదో కానీ చంపేయాలి’! | Pak Former Cricketers Angry Shoot Man Who Gave That Gameplan After Loss 1st ODI | Sakshi
Sakshi News home page

‘గేమ్‌ప్లాన్‌ ఎవడిదో కానీ చంపేయాలి’!

Mar 12 2026 12:39 PM | Updated on Mar 12 2026 12:51 PM

Pak Former Cricketers Angry Shoot Man Who Gave That Gameplan After Loss 1st ODI

పాకిస్థాన్‌ క్రికెట్‌ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ, కమ్రాన్‌ అక్మల్‌ గేమ్‌ప్లాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ మాట్లాడుతూ.. ‘పవర్‌ప్లేలో 60 కంటే తక్కువ పరుగులు చేయాలని చెప్పిన వాడిని మొదట షూట్‌ చేయాలి. గేమ్‌ప్లాన్‌ చాలా చెత్తగా ఉంది. నాకు తెలిసి ఆ చెప్పినవాడు ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రౌండ్‌లోకి దిగినట్లుగా అనిపించడం లేదు. కేవలం పేపర్‌పై రాసుకొన్న థియరీని మాత్రమే అప్లై చేసే పనిలో పడ్డట్లున్నాడు. పిచ్‌ పరిస్థితులపై కనీసం అంచనాలు లేకుండా జట్టును బరిలోకి ఎలా దించుతారు. ఇదే పిచ్‌పై టీమిండియా కూడా ఓటమి పాలైందన్న సంగతి మరిచిపోయినట్లున్నారు.’ అని తెలిపాడు. 

మరో మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతుంటే.. పాకిస్థాన్‌ ఆటతీరు మాత్రం క్లబ్‌ క్రికెట్‌ కోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్నట్లుగా ఉంది. బాసిత్‌ అలీకి ఫోన్‌ చేసి పాక్‌ జట్టు ఆడుతున్న ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు క్లబ్‌ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా ఆడరనుకుంటా’ అని తెలిపాడు. 

బంగ్లాతో మ్యాచ్‌లో ఓటమికి  కారణాలు చాలానే ఉన్నాయని బాసిత్‌ అలీ తెలిపారు. జట్టులో యువరక్తం ఎక్కువగా ఉందని, వాళ్లంతా సెటిల్‌ కావడానికి టైం పట్టే అవకాశముందన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 30.4 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్‌ అశ్రఫ్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నహిద్‌ రానా 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం బంగ్లాదేశ్‌ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 13న జరగనుంది.

చదవండి: గురుశిష్యులకు అరుదైన గౌరవం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement