అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు: గంగూలీ | Ganguly Has Expressed Frustration Over Continued Exclusion Of T20I Star, Says I Am Absolutely Flabbergasted About Him Not Getting Spot | Sakshi
Sakshi News home page

Sourav Ganguly: వైభవ్‌కు ఏ జట్టులోనైనా చోటు.. అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు?

Mar 12 2026 2:14 PM | Updated on Mar 12 2026 3:32 PM

Absolutely flabbergasted about him not getting spot Ganguly on Indian Star

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో తిరుగులేని జట్టుగా టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. తాజాగా సూర్యకుమార్‌ కెప్టెన్సీలో సొంతగడ్డపై 2026 టైటిల్‌ గెలిచింది. ఈ రెండు సీజన్లలో కలిపి మొత్తంగా 17 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏకంగా 16 గెలిచింది.

వరుసగా రెండోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్లో భారత్‌కు రెండు జట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

రెండు జట్లు ఉంటే
‘‘ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉండి.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ కూడా అందుబాటులో ఉంటే భారత్‌ మరో జట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఓ జట్టు ఉండాలి. నిజానికి కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌ వంటి వాళ్లకు టీ20 ఫార్మాట్లో అవకాశాలే రావడం లేదు.

అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు
ఇక వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోని ఏ జట్టులోనైనా సరే అతడికి చోటు ఉంటుంది. శ్రేయస్‌ అయ్యర్‌ విషయాని​కి వస్తే.. ఇప్పటికీ అతడు భారత టీ20 జట్టులోకి రాలేకపోతున్నాడు. అతడికి అసలు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో నాకైతే ఇంత వరకు అర్థం కావడమే లేదు.

అయ్యర్‌ విషయంలో యాజమాన్యం వైఖరి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక బౌలర్ల విషయానికొస్తే ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌లకు కూడా టీ20లలో ఆడే అవకాశం రావడం లేదు. లెక్కకు మిక్కిలి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి భారత్‌ రెండు టీ20 జట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అని గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.

విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగా
కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా టైటిల్‌ గెలిచిన అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

ఇక ఈ రెండు సీజన్లలో కలిపి ఏకంగా దాదాపు 950 పరుగులు సాధించాడు. అయితే, టీ20 జట్టులో ఖాళీ లేకపోవడం వల్లే శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement