పాక్‌కు ఘోర ఓటమి.. షాహిన్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు | Shaheen Afridi retains faith in young Pak brigade despite Loss To BAN | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. షాహిన్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు

Mar 12 2026 5:35 PM | Updated on Mar 12 2026 5:44 PM

Shaheen Afridi retains faith in young Pak brigade despite Loss To BAN

బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్‌ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కనీసం సెమీస్‌ చేరకుండానే పాకిస్తాన్‌ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.

మూడు వన్డేల సిరీస్‌
ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది పాక్‌ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 

114 పరుగులకే ఆలౌట్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిని పాక్‌.. 114 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌, అరంగేట్ర బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్‌ ఫాహీమ్‌ ఆష్రఫ్‌ 37 పరుగులతో పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహీద్‌ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ ‍బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

15.1 ఓవర్లలోనే ఫినిష్‌
లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో విఫలమైన బాబర్‌ ఆజంను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ నుంచి తప్పించింది యాజమాన్యం.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షామిల్‌ హుసేన్‌, మాజ్‌ సదాకత్‌ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్‌ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన సదాకత్‌ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షామిల్‌ 4 పరుగులకే అవుటయ్యాడు.

ఓడినా పర్లేదు
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి అనంతరం పాక్‌ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.

అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్‌లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్‌, బాల్‌.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్‌ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.

అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి
అయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్‌ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్‌ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్‌ స్టేడియం ఇందుకు వేదిక.

చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement