నిక్కరుతో నడిరోడ్డుపై ‘టీఎంసీ పుష్ప’ ఊరేగింపు! | TMCs Pushpa of Falta Paraded in Shorts and Rope After Arrest | Sakshi
Sakshi News home page

నిక్కరుతో నడిరోడ్డుపై ‘టీఎంసీ పుష్ప’ ఊరేగింపు!

Jun 15 2026 1:22 PM | Updated on Jun 15 2026 1:30 PM

TMCs Pushpa of Falta Paraded in Shorts and Rope After Arrest

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని సంచలన దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేత, ‘పుష్ప ఆఫ్ ఫాల్తా’గా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నడుముకు తాడు కట్టి, కేవలం ఒక నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు. అరెస్ట్ అయినప్పటి నుండి ఆయనను ఇలా బహిరంగంగా వీధుల్లో తిప్పడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, ప్రజలకు చేతులు జోడించి ఆయన క్షమాపణలు కోరుతున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.

అరెస్ట్ వెనుక అసలు కథ
దౌర్జన్యాలు, వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై జహంగీర్ ఖాన్‌ను జూన్ 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగాల్ కోర్టు ఆయనకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఉత్తర బెంగాల్‌లోని భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పానిటంకి ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఈ డైమండ్‌ హార్బర్ నేత, మే 21న జరిగిన  ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు.
 

కోర్టు రక్షణ ఎత్తివేత
జహంగీర్ ఖాన్‌పై ఫాల్తా పోలీస్ స్టేషన్‌లో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో మే 21న జరిగే రీ-పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనడానికి, ప్రచారం చేసుకోవడానికి వీలుగా కలకత్తా హైకోర్టు మే 18న ఆయనకు అరెస్ట్ నుండి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయితే ఊరట లభించిన మరుసటి రోజే తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఖాన్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత మే 24న ఎన్నికల ఫలితాలు వెలువడగా, మే 26న కలకత్తా హైకోర్టు ఆయనకు ఇచ్చిన తాత్కాలిక రక్షణను పూర్తిగా రద్దు చేసింది.

పోలీస్ కస్టడీలో పరాభవం
కోర్టు రక్షణ ఎత్తివేసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి  ఈ నేతను నిక్కరుతో, నడుముకు తాడు కట్టి పోలీసులు రోడ్డుపై నడిపించడం సంచలనంగా మారింది. గతంలో అధికార బలంతో అహంకారంగా వ్యవహరించిన ఈ నేత, ఇప్పుడు దీనస్థితిలో ప్రజలకు క్షమాపణలు చెబుతూ కనిపించడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement