ఎవరెస్ట్‌ ఒడిలో విషాద గాథ.. ‘గ్రీన్‌ బూట్స్‌’ ఎవరివంటే? | Green Boots Mystery Solved After 30 Years, DNA Confirms Indian Soldier’s Identity As ITBP Plans Final Everest Recovery Mission | Sakshi
Sakshi News home page

Green Boots: ఎవరెస్ట్‌ ఒడిలో విషాద గాథ.. ‘గ్రీన్‌ బూట్స్‌’ ఎవరివంటే?

Aug 8 2026 9:14 AM | Updated on Aug 8 2026 10:11 AM

30 Years Frozen in Time: The Tragic Tale of Everest Green Boots

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. ఎవరెస్ట్‌. అక్కడ అడుగు పెట్టడం ప్రతి పర్వతారోహకుడి జీవిత కల. కానీ ఆ మంచు పర్వతం ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. ఇటీవల హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న పర్వత ప్రమాదాలు మరోసారి ఎత్తైన శిఖరాలపై దాగి ఉన్న ముప్పును గుర్తుచేశాయి. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా ఎవరెస్ట్‌ డెత్‌ జోన్‌లో ఓ రాతి చాటున మిగిలిపోయిన ఓ భారత సైనికుడి కథ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచానికి ‘గ్రీన్‌ బూట్స్‌’గా పరిచయమైన ఆ మృతదేహం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది.

ఎవరెస్ట్‌ ఉత్తర మార్గంలో శిఖరానికి వెళ్లే సమయంలో ఓ రాతి గుహలాంటి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ మంచులో కూరుకుపోయిన ఓ పర్వతారోహకుడి మృతదేహం ఎన్నో ఏళ్లుగా కనిపించేది. అతడి కాళ్లకు ఉన్న ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు పర్వత బూట్ల కారణంగా ఆ మృతదేహానికి ‘గ్రీన్‌ బూట్స్‌’ అనే పేరు వచ్చింది.

ఎవరెస్ట్‌ అధిరోహణకు వెళ్లే ప్రతి పర్వతారోహకుడికి అది ఓ భయానక గుర్తుగా మారింది. విజయం కోసం చివరి దశలో ఉన్న వారికి.. ప్రకృతి శక్తుల ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే విషాద చిహ్నంగా నిలిచింది.

మూడు దశాబ్దాల మిస్టరీకి తెర
ఏళ్ల పాటు ‘గ్రీన్‌ బూట్స్‌’ ఎవరిది అనే దానిపై అనేక ఊహాగానాలు కొనసాగాయి. చాలామంది అది భారత ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP)కు చెందిన పర్వతారోహకుడు త్సెవాంగ్‌ పాల్‌జోర్‌ మృతదేహమని భావించారు. కారణం.. 1996లో ఎవరెస్ట్‌ యాత్రకు వెళ్లిన ఆరుగురు సభ్యుల ITBP బృందంలో పాల్‌జోర్‌ కూడా ఉండటం, ఆయన కూడా ఆకుపచ్చ రంగు బూట్లు ధరించడం.

అయితే తాజా ఆధారాలు, డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా ‘గ్రీన్‌ బూట్స్‌’గా గుర్తించిన మృతదేహం నిజానికి మరో ITBP సభ్యుడు లాన్స్‌ నాయక్‌ డోర్జీ మోరప్‌దిగా నిర్ధారణ అయింది.

1996.. విషాద యాత్ర
డోర్జీ మోరప్‌ కథ 1996 ఎవరెస్ట్‌ విషాదంతో ముడిపడి ఉంది. ఆ ఏడాది ITBP బృందం ఎవరెస్ట్‌ను ఉత్తర మార్గం నుంచి అధిరోహించేందుకు బయలుదేరింది. చైనా వైపు నుంచి ఉన్న ఈ మార్గం అత్యంత కఠినమైనదిగా పరిగణిస్తారు. ఆరుగురు సభ్యుల బృందంలో ముగ్గురు ప్రతికూల వాతావరణం కారణంగా వెనుదిరిగారు. కానీ సుబేదార్‌ త్సెవాంగ్‌ స్మాన్లా, లాన్స్‌ నాయక్‌ డోర్జీ మోరప్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ త్సెవాంగ్‌ పాల్‌జోర్‌ మాత్రం ముందుకు సాగారు.

ఎట్టకేలకు వాళ్లు ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్నారు. సుమారు 8,849 మీటర్ల ఎత్తులో భారత జెండాను రెపరెపలాడించారు. కానీ విజయంతో తిరిగి వస్తున్న సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఆ తర్వాత ముగ్గురూ తిరిగి రాలేదు.

విజయం కంటే కష్టమైన తిరుగు ప్రయాణం
ఎవరెస్ట్‌పై శిఖరాన్ని చేరుకోవడం మాత్రమే కాదు.. అక్కడి నుంచి సురక్షితంగా కిందకు రావడమే అసలు సవాల్‌. డోర్జీ మోరప్‌ తిరుగు ప్రయాణంలో తీవ్ర చలికి గురయ్యారు. మంచుతో గడ్డకట్టిన చేతులతో పరికరాలను సరిగ్గా ఉపయోగించలేకపోయారని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. చివరకు ఆయన 8,500 మీటర్ల ఎత్తులో ఓ రాతి చాటు ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రదేశం తర్వాత ‘గ్రీన్‌ బూట్స్‌ గుహ’గా మారింది.

భర్త కోసం మూడు దశాబ్దాల నిరీక్షణ
డోర్జీ మోరప్‌ ఎవరెస్ట్‌కు బయలుదేరే ముందు తన భార్యతో చివరిసారి మాట్లాడారు. విజయం సాధించి తిరిగి వస్తానని చెప్పారు. కానీ ఆ మాటలు జ్ఞాపకంగానే మిగిలిపోయాయి. మృతదేహాన్ని చూడకపోవడంతో ఆయన భార్యకు భర్త మరణాన్ని పూర్తిగా అంగీకరించడం కూడా కష్టమైంది. మూడు దశాబ్దాలుగా ఓ చివరి వీడ్కోలు కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూనే ఉంది.

ఎందుకంత కష్టం?
ఎవరెస్ట్‌పై 8,000 మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాన్ని ‘డెత్‌ జోన్‌’ అంటారు. అక్కడ ఆక్సిజన్‌ స్థాయి సముద్ర మట్టంతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 40 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి ప్రాంతంలో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌. మంచు చరియలు, తీవ్రమైన గాలులు, తక్కువ ఆక్సిజన్‌ కారణంగా అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది.

ఎవరెస్ట్‌పై ఉన్న దాదాపు 200కు పైగా మృతదేహాల్లో చాలా వరకు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. వాటిని తరలించడం కంటే.. కొత్తగా ఎవరెస్ట్‌ను అధిరోహించడమే కొన్నిసార్లు సులభమని నిపుణులు చెబుతారు.

‘గ్రీన్‌ బూట్స్‌’ మరో విషాదానికి సాక్షి
2006లో బ్రిటిష్‌ పర్వతారోహకుడు డేవిడ్‌ షార్ప్‌ ఇదే ప్రాంతంలో తీవ్ర చలికి గురై మరణించారు. కొందరు పర్వతారోహకులు మొదట ఆయనను ‘గ్రీన్‌ బూట్స్‌’ మృతదేహంగా భావించారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ ఘటన ఎవరెస్ట్‌పై రక్షణ బాధ్యతలు, మానవత్వంపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఇప్పుడు మొదలైన చివరి ప్రయాణం
డీఎన్‌ఏ పరీక్షలతో డోర్జీ మోరప్‌ గుర్తింపు ఖరారైన తర్వాత.. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకురావాలని ITBP నిర్ణయించింది. దీనికి ప్రత్యేకంగా అత్యంత అనుభవజ్ఞులైన పర్వతారోహకుల బృందం అవసరం. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది అక్టోబర్‌ కల్లా ఈ ఆపరేషన్‌ పూర్తి కానుంది.

30 ఏళ్లుగా ఎవరెస్ట్‌ మంచులో నిశ్శబ్దంగా ఉన్న ఓ భారత వీరుడి కథకు ఇప్పుడు ముగింపు పలికే సమయం వచ్చింది. ప్రపంచానికి ‘గ్రీన్‌ బూట్స్‌’గా కనిపించిన ఆ గుర్తు వెనుక.. ఓ సైనికుడి త్యాగం, ఓ కుటుంబం ఎదురుచూపు, ఓ అసంపూర్తి వీడ్కోలు దాగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement