బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే..
పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.
జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్
బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్‌లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?
పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలు
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్‌కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్‌లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.
బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరిక
బంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరిలో కారకులెవరూ?
బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్‌కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.
మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.
అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?
బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.
ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


