బిహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ.. ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. అయితే.. గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గి, నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. దీంతో అసలు ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేంటన్న ప్రశ్న బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
బాంకిపూర్ బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గం. 1995 నుంచి ఈ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ఎంచుకుంది బీజేపీ. దీంతో గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా ఎన్‌డీఏ అగ్రనేతల సమక్షంలో అభిషేక్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. గంటలు కూడా తిరగక ముందే సీన్ మారింది.
Patna, Bihar: BJP candidate Abhishek Kumar “Bunty” filed his nomination for the Bankipur Assembly by-election. Several senior NDA leaders attended the nomination pic.twitter.com/YqQ6MUU7f7
— IANS (@ians_india) July 9, 2026
శుక్రవారం అనూహ్యంగా ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో.. పెద్దగా చదువుకోని బంటీని బరిలోకి దింపడం సబబు కాదని బీజేపీ భావించిందనే ప్రచారం ఉదృతంగా జరిగింది. అయితే దానిని బంటీ కొట్టిపారేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడం సాధ్యం కాదని" రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగికి లేఖ రాసి తప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా అదే కారణాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
सुनिए क्यों बांकीपुर से BJP के उम्मीदवार अभिषेक बंटी नॉमिनेशन के बाद अपना उम्मीदवारी वापस लिए #BJP #Bankipur #election pic.twitter.com/MQ0UWMrwk5
— Mukesh singh (@Mukesh_Journo) July 10, 2026
అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి దాణా (ఫోడర్) కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి. 2022లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూతో పాటు మరో 75 మందికి శిక్ష విధించగా, అప్పట్లో మగధ్ కెమికల్ కార్పొరేషన్ మేనేజర్‌గా పనిచేసిన రవీంద్ర ప్రసాద్‌కు కూడా మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ఈ నేపత్యంలో.. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించి, ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రక్షణాత్మక స్థితిలో పడకూడదన్న ఉద్దేశంతో బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఇటీవలే పార్టీ అగ్రనేతల దృష్టికి రావడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సాధారణ పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందిన నీరజ్ కుమార్ సిన్హా బరిలో నిలిచారు. ఆయన నేరుగా ప్రశాంత్ కిశోర్‌తో తలపడనున్నారు.
#WATCH | Bye-elections | Bihar BJP President Sanjay Sarogi felicitates party's candidate from Bihar's Bankipur Assembly seat, Neeraj Kumar Sinha
Neeraj Kumar Sinha says, "I am overjoyed. I am deeply grateful to the top leadership, the state president, our leader Nitin Nabin ji,… pic.twitter.com/aKPWkznCQq— ANI (@ANI) July 10, 2026
ప్రశాంత్ కిశోర్ బరిలో ఉండటం, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి మారడం వంటి పరిణామాలతో ఈ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఆసక్తికర రాజకీయ పోరుగా మారింది.


