ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తి కోసం కన్న తల్లినే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపూర్ యువతి ఆయుషి శర్మ (23) కేసులో మరో సంచలన మలుపు తిరిగింది. ఇప్పటికే తల్లి నీరజ్ శర్మ హత్య కేసులో అరెస్టైన ఆయుషిపై.. ఇప్పుడు తన తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ పాత్ర ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో ఈ కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ శర్మ రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసేవారు. అనారోగ్యానికి గురైన ఆయన 2025లో మరణించారు. ఆయన మృతి అనంతరం కారుణ్య నియామకం కింద భార్య నీరజ్ శర్మకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగం లభించింది. అయితే ఆ ఉద్యోగం తనకే రావాలని కుమార్తె ఆయుషి భావించినట్లు, అదే సమయంలో కుటుంబ ఆస్తి విషయంలోనూ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి..
ఈ నేపథ్యంలో జూలై 3న కోచింగ్ సెంటర్‌లో తన కుమారుడిని దింపి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న నీరజ్‌ను అతివేగంగా వచ్చిన ఎస్‌యూవీ ఢీకొట్టింది. తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో ఇది ముందే పథకం వేసి చేసిన హత్య అని తేలింది. తల్లి హత్య కోసం ఆయుషి బంధువులతో కలిసి రూ.7 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు(ఆయుషి కజిన్) పరారీలో ఉన్నాడు.
ఇదే కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నీరజ్ సోదరుడు రాకేశ్ శర్మ మరో సంచలన ఫిర్యాదు చేశారు. తన బావ విజయ్ శర్మ మరణం కూడా సహజ మరణం కాదని, దాని వెనుక కూడా ఆయుషి, ఆమె బంధువు బలరామ్ పాత్ర ఉండొచ్చని ఆరోపించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న విజయ్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లి నెలల తరబడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, చివరకు ఆస్పత్రిలో చేర్చినప్పటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తండ్రి మరణం అనంతరం ప్రభుత్వ ఉద్యోగం తనకే ఇవ్వాలని, కుటుంబ ఆస్తి మొత్తం తన పేరుపై బదిలీ చేయాలని ఆయుషి ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు.. ఒకసారి తల్లితో జరిగిన వాగ్వాదంలో "నాన్న ఫీడింగ్ ట్యూబ్ తీసేసి చంపగలిగాం.. నిన్ను చంపడం ఇంకా సులువు" అని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందు నీరజ్ శర్మ వాట్సాప్‌లో "నాకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి" అనే భావం వచ్చే స్టేటస్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పోలీసులు విజయ్ శర్మ మరణంపైనా దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు.. ఈ కేసులో మరో సంచలన కోణం కూడా బయటపడింది. ఆయుషి తన తల్లి నీరజ్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకుందని తెలిసింది. తన గురించి కాకుండా ఎప్పుడూ తన దివ్యాంగ సోదరుడి గురించే తల్లి ఎక్కువగా ఆలోచించేదని.. అతన్నే ప్రేమగా చూసేదని బంధవువుల వద్ద ఆయుషి వాపోయేదట. ఈ క్రమంలోనే.. కుటుంబ ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం, వ్యక్తిగత కక్షలే ఈ హత్య వెనుక ప్రధాన కారణాలై ఉంటాయని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
ప్రస్తుతం విజయ్ శర్మ మరణానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. వైద్య చికిత్స వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా విజయ్ శర్మ మరణంపై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న కేసులో అదనపు అభియోగాలు చేర్చాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ కేసు రాజస్థాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


