భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్‌ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.
పశ్చిమబెంగాల్‌లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.
ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో హాఫ్ ఎన్‌కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.
గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్‌లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్‌కౌంటర్లు, హాఫ్ ఎన్‌కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.
2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్‌కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్‌కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.
యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్‌కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్‌గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్‌కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్‌కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.
బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్‌గా చేసుకున్నారు.
తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్‌సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్‌సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్‌కౌంటర్లు, హాఫ్ ఎన్‌కౌంటర్లు, లాకప్ డెత్‌లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


