క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చరిత్రాత్మక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారిగా భారత్‌లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ సంయుక్తంగా ప్రకటించారు.
దీంతో బీబీఎల్ 2026-2027 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా డిసెంబరు 12న ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి.
క్రీడా సంబంధాల బలోపేతం
కాగా విదేశీ టీ20 లీగ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగా ఇరుదేశాలు ఇందుకు అంగీకరించాయి.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆసీస్ మీడియా ‘ది ఏజ్’ వెల్లడించింది.
మమ్మల్నీ ఆదరించండి
ఇక భారత్‌లో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణ గురించి సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల గురించి మాకు తెలుసు. ముఖ్యంగా చెన్నైలో అయితే ఆటకు మరింత ఆదరణ ఉంది. కచ్చితంగా బీబీఎల్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నాం.
ఇప్పటికే ఇండియాలో చాలా మందికి బీబీఎల్ గురించి తెలుసు. చాలా మంది బీబీఎల్ మ్యాచ్‌లను కూడా చూస్తారు. అందుకే ఈసారి నేరుగా వారి దేశంలోనే బీబీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నాము. ఐపీఎల్ మాదిరే మా పట్ల కూడా ఆదరణ చూపుతారని నమ్ముతున్నాము’’ అని పేర్కొన్నాడు.


