వరల్డ్‌కప్‌ సెమీస్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్‌ | FIFA World Cup 2026, France Beat Morocco Enters Semi Finals As Mbappé Scores Milestone Goal, Check Out Highlights | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ సెమీస్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్‌

Jul 10 2026 8:52 AM | Updated on Jul 10 2026 12:37 PM

FIFA World Cup 2026 France Beat Morocco Enters Semi Finals

బోస్టన్‌: అంచనాలకు అనుగుణంగా రాణించిన ఫ్రాన్స్‌ జట్టు ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ముగిసిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ 2–0 గోల్స్‌ తేడాతో మొరాకో జట్టును ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. 

ఫ్రాన్స్‌ తరఫున కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపె (60వ నిమిషంలో), డెంబెలె (66వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె వృథా చేశాడు. ఇక స్పెయిన్, బెల్జియం జట్ల మధ్య రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ తలపడుతుంది. 

ఎంబాపె 20వ గోల్‌
ప్రపంచకప్‌ చరిత్రలో ఎంబాపెకిది 20వ గోల్‌ కావడం విశేషం. ఇక తొలి అర్ధభాగంలో మొరాకో గోల్‌కీపర్‌ యాసిన్‌ బౌను అద్భుత ప్రదర్శన కారణంగా ఫ్రాన్స్‌ ఖాతా తెరువలేకపోయింది. 

అయితే రెండో అర్ధభాగంలో మొరాకో డిఫెండర్లు తడబడ్డారు. 60వ నిమిషంలో డిజైర్‌ డుయి అందించిన పాస్‌ను ఎంబాపె లక్ష్యానికి చేర్చగా... ఆరు నిమిషాల తర్వాత ఎంబాపె అందించిన పాస్‌ను డెంబెలె గోల్‌గా మలిచాడు. ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసిన ఫ్రాన్స్‌ మరింత జోరు పెంచగా... మొరాకో డీలా పడిపోయింది.  కాగా గత ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ చేతిలోనే ఓడిన మొరాకో జట్టు ఈసారి క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి చవిచూసింది.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement