ఆఫ్రికా నుండి ఫ్రెంచ్‌ నిష్క్రమణ? | Sakshi Guest Column On France and Africa Issue | Sakshi
Sakshi News home page

ఆఫ్రికా నుండి ఫ్రెంచ్‌ నిష్క్రమణ?

Jul 10 2026 12:38 AM | Updated on Jul 10 2026 12:38 AM

Sakshi Guest Column On France and Africa Issue

విశ్లేషణ

గత నెలాఖరులో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్‌ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్‌ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్‌ తరువాత ఫ్రాన్స్‌ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్‌ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్‌ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్‌ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్‌ పాలన నుండి విముక్తి పొందింది.

ఫ్రాన్స్‌ తీరు వేరు!
వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్‌ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్‌ సైన్యం ఆప రేషన్‌ సెవాల్‌ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్‌ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్‌లో ఒమర్‌ బాంగో, చాద్‌లో డెబీ ఫ్రెంచ్‌ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్‌ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్‌ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్‌ సైనికులను వినియోగించారు. 

ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్‌ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్‌ వలస దేశాలు సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్‌ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్‌ను ఫ్రెంచ్‌ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్‌ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాలను ఫ్రెంచ్‌ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్‌ దేశాలు ఫ్రెంచ్‌ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.

2020 తరువాత ఫ్రాన్స్‌ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్‌ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్‌ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్‌ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్‌ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్‌ల నుండి ఫ్రెంచ్‌ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్‌ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. 

పెరుగుతున్న చైనా ప్రభావం
ఆఫ్రికా నుండి ఫ్రాన్స్‌ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూప్‌ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్‌ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్‌ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్‌గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్‌ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్‌లోని యురేనియం, గినియాలోని బాక్సైట్‌ గనుల నుండి ఫ్రెంచ్‌కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. 

ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్‌ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్‌ ఫ్రాంక్‌ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్‌ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్‌జాన్‌ (ఐవరీ కోస్ట్‌), పాయింట్‌ నాయిర్‌ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్‌ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్‌లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్‌ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్‌ (గాబన్‌)లతో పాటుగా యురేనియం (నైజర్‌), చమురు, గ్యాస్‌ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.

మనకో సువర్ణావకాశం
భారత్‌కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్‌ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్‌ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్‌కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్‌ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్‌ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్‌ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్‌ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్‌కు ప్రతికూలాంశం.

ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్‌ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్‌ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్‌ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్‌ యూనియన్‌ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్‌ ముందున్న మార్గం.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement