విధానాల్లో శాస్త్రీయత ఉంటోందా? | Sakshi Guest Column On Electric two-wheelers | Sakshi
Sakshi News home page

విధానాల్లో శాస్త్రీయత ఉంటోందా?

Jul 9 2026 1:15 AM | Updated on Jul 9 2026 1:15 AM

Sakshi Guest Column On Electric two-wheelers

విశ్లేషణ

ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాన్ని ప్రకటించింది. వీధుల్లో వాయు నాణ్యతను మెరుగుపర చేందుకు పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల వాడకాన్ని పూర్తిగా దశలవారీగా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఆల్కహాల్‌ మోతాదు తక్కువగా ఉన్న లిక్కర్‌ పానీయాలపై పన్నులను తగ్గించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మత్తు పానీయాల నుంచి ప్రజానీకాన్ని దూరం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని కేరళ భావిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్న భోజన పథకం కింద పెడుతున్న వాటిలో కోడి గుడ్ల స్థానంలో శాకాహార ప్రొటీన్లను ప్రవేశపెడుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పెట్రోల్‌లో ఇథనాల్‌ మోతాదును క్రమేపీ పెంచే విధానాలపై తీవ్ర తర్జనభర్జనలు సాగుతున్నాయి. కానీ విధానాలు ఆయా లక్ష్యాలను సాధించాలంటే అవి సమాజ అవసరాలతోపాటు శాస్త్రీయ ఆధారాలను ప్రాతిపదిక చేసుకోవాలి.

అసలు కాలుష్య చిత్రం
ఢిల్లీ ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం ద్వి, త్రిచక్ర వాహనాలపైనే దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 2028 ఏప్రిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ టూవీలర్ల, 2027 జూలై నుంచి ఎలక్ట్రిక్‌ త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో మొత్తం వాహనాలు 1.3 కోట్ల మేరకు ఉంటే, అందులో టూవీలర్లు 62 శాతం, కార్లు 32 శాతం. దీన్నిబట్టి, టూవీలర్ల వాడకాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధించాలన్న ప్రభుత్వ నూతన విధానంలో హేతుబద్ధత కనిపిస్తుంది. కానీ, అది పూర్తి చిత్రాన్ని రూపుకట్టించే వాస్తవం కాదు. ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో టూవీలర్లు 62 శాతం మేర ఉంటే ఉండవచ్చుగానీ, ట్రాన్స్‌పోర్టేషన్‌ సంబంధిత ధూళికణాల (పీఎం2.5) విడుదలలో వాటి వాటా 15 శాతమే. ఢిల్లోలోని వాహనాల్లో తేలిక, భారీ రకం వాణిజ్య వాహనాలు 3 శాతంకన్నా తక్కువే ఉండ వచ్చుగానీ, ఈ ఉద్గారాలలో వాటి వాటా 39 శాతం. బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు చెందిన గుఫ్రాన్‌ బేగ్‌ 2025లో ప్రచురించిన విధాన సంక్షిప్త పత్రంలో అటు వంటి విశేషాలు దాగున్నాయి. 

దాన్ని పరిశీలిస్తే, వాణిజ్య వాహనాలు, బస్సుల ఉద్గారాల సమస్యను పరిష్కరించడం ద్వారానే పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ఎక్కువ మేలు చేకూరగలదని అర్థమవుతుంది. ఎలక్ట్రిక్‌ టూవీలర్ల వాడకం పర్యావరణానికి ప్రయోజనదాయకమేకానీ, ప్రభుత్వ విధానాలు మొదట అత్యంత కలుషితదాయకమైన విభాగాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి 2025 డిసెంబర్‌లో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని కూడా పరిశీలించింది. విధానపరమైన దృక్పథం ముక్కచెక్కలుగా ఉండకూడదని అది హెచ్చరించింది. రాష్ట్ర స్థాయి బదులు ఒక భౌగోళిక ప్రాంత స్థాయిలో చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఆ వైఖరి లోపించి నపుడు, ఢిల్లీ ఈవీలవైపు మళ్ళినా ఒనగూడే పర్యావరణపరమైన ప్రయోజనాలు పెద్దగా ఉండవు. కాలుష్య కారక వాహనాలు ఢిల్లీ చుట్టుపక్కలనున్న రాష్ట్రాలకు వచ్చి ఆ మొత్తం భౌగోళిక ప్రాంత ఉద్గారాలకు తమవంతు వాటాను జోడిస్తూనే ఉంటాయి. 

ఏదైనా తగని మోతాదే!
దేశంలోకెల్లా మద్యపాన వినియోగం కేరళలోనే ఎక్కువ. ఆల్కహాల్‌ వినియోగాన్ని తగ్గించడానికి, ఆల్కహాల్‌ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలపై పన్ను తగ్గించాలనీ, తద్వారా వీటి వినియోగాన్ని పెంపొందించినట్లు అవుతుందనీ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఆల్కహాల్‌ మోతాదు తక్కువగా ఉన్న పానీయాల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనం ఏమైనా ఉందా అని కేరళ ప్రభుత్వం కొద్దిగా కూడా దృష్టి సారించినట్లు లేదు. మొదటగా, ఆల్కహాల్‌ వినియోగానికి సురక్షితమైన పరిమితులంటూ ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గుండెకు రెడ్‌ వైన్‌ మంచిదనే అభిప్రాయం కూడా అపోహ మాత్రమేనని వెల్లడించింది. కనుక, పన్నుల విధానాలు ఆల్కహాల్‌ మోతాదు తక్కువ లేదా ఎక్కువ అనే తేడా చూపనవసరం లేదు. పైగా, ఆల్కహాల్‌ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలను చౌకగా మారిస్తే, మొత్తం మీద లిక్కర్‌ వినియోగం పెరగడానికి తలుపులు తెరిచినట్లు అవుతుంది. ఈ పానీయాలు తేలిగ్గా అందుబాటులో ఉండటం వల్ల మైనర్లు తప్పుదారి పట్టవచ్చు. వారు క్రమంగా మద్యపానం వైపు మళ్ళవచ్చు. లైట్‌ సిగరెట్లు, హుక్కా, ఇ–సిగరెట్లు అంటూ పొగాకు పరిశ్రమ విషయంలో కూడా అలాగే చేశారు. లిక్కర్‌ కంపెనీలు తమ హార్డ్‌ లిక్కర్‌ బ్రాండ్లను మార్కెట్‌ చేసుకునేందుకు లో–ఆల్కహాల్‌ ఉత్పత్తుల వినియోగాన్ని ఒక ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. 

మైలేజీ ఉంటుందా?
మరో ప్రభుత్వ ప్రధాన విధాన విషయంలో కూడా ఆల్కహాల్‌ కేంద్ర బిందువుగా మారింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఇంధన భద్రత, విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయడం నుంచి రైతుల సంక్షేమం వరకు ఈ విధానం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి తెగ చెప్పు కొస్తున్నారు. మరోపక్క వాహనాల యజమానులు తమ ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, మైలేజి పడిపోతోందనీ ఫిర్యాదు చేస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు అంగీకరిస్తున్నట్లుగా ఇథనాల్‌ మిళిత ఇంధ నాల వల్ల కార్ల మైలేజీ తగ్గుతూ, వాహనాల యజమానులు చెబు తున్నట్లుగా ఇంజిన్లు దెబ్బతింటూంటే మొత్తంమీద ఆర్థిక వ్యయాలు పెరుగుతాయేగానీ, తగ్గవు. రైతులు ఆహార పంటల నుంచి నీరు ఎక్కువ అవసరమైన చెరకు వంటి పంటలవైపు మళ్లితే, ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్‌ కాలంలో ఇథనాల్‌ కంపెనీలు మొక్క జొన్న, వరిని కూడా ఉపయోగించుకుంటాయి.  

మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను తొలగించాలన్న పశ్చిమ బెంగాల్‌ నిర్ణయం శాస్త్రీయ ఆధారాల ముందు తేలిపోతుంది. అవి నాణ్యమైన ప్రొటీన్‌ అందిస్తాయనీ, కనుక వాటిని ఆహారంలో చేర్చాలనీ పౌష్ఠికాహారవేత్తలు దశాబ్దాలుగా చెబుతు న్నారు. ఆహారానికి బలం చేకూరే విధంగా పన్నీరు, కాయధాన్యా లతోపాటు గుడ్లను కూడా పెట్టాలని హితవు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్ఠికాహార సంస్థ 2024 నాటి పోషణ మార్గదర్శకాలు కూడా అదే విషయాన్ని బలపరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు విశ్వసనీయమైన, ప్రాధాన్యం కలిగిన శాస్త్రీయ ఆధారాలను ఆలంబనగా చేసుకుని రూపొందాలేగానీ, స్వల్పకాలిక లాభాలను, సంకుచిత రాజకీయ, వ్యాపార లేదా సైద్ధాంతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నవి కాకూడదు. విధాన నిర్ణేతలు తమ వాదనలకు బలంగా ఇప్పటికే ఉన్న ఆధారా లను ఉపయోగించుకోవచ్చు లేదా నూతన పరిశోధనలను నిర్వహించవచ్చు. నూతన ఆధారాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ విధానా లను సమీక్షించుకోవాలి. పరస్పరం ముడిపడి ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజారోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నామని గుర్తెరగాలి.

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement