కమ్యూనిస్టుల ఐక్యత ఎలా జరగాలి? | Sakshi Guest Column Special Story On Communist Unity | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టుల ఐక్యత ఎలా జరగాలి?

Jul 9 2026 1:33 PM | Updated on Jul 9 2026 1:37 PM

Sakshi Guest Column Special Story On Communist Unity

అభిప్రాయం

మ్యూనిస్టు శ్రేయోభిలాషులు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ఐక్యత మత విద్వేషాలను ఎదుర్కొనే అంశానికే పరి మితం కాకూడదు. నేటి వ్యవస్థను సమూ లంగా మార్చేందుకు ఉమ్మడి అవగాహనతో పంథా, కార్యక్రమాలు ఉండాలి.

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం అనేక కమ్యూనిస్టు పార్టీలుగా మనుగడ సాగిస్తోంది. వీటిల్లో విప్లవ పార్టీలు, పార్లమెంటరీ పార్టీలు ఉన్నాయి. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలకు నేటి వ్యవస్థ స్వభావం, వ్యవస్థను ఏ విధంగా మార్చాలి, పాలక వర్గాల స్వభావం గురించి, భూస్వామ్య వ్యవస్థ గురించి, బడా బూర్జువా వర్గం స్వభావం గురించిన అవగాహనలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పొసగదు. ఇలా ఉన్న పార్టీలన్నీ భారత సామాజిక వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థను మార్చడం గురించి ఒక అవగాహన లేకుండా ఐక్యత ఎలా సాధ్యం అవుతుంది? ఐక్యత కోరుకునే మిత్రులందరూ ఈ వాస్తవాన్ని గ్రహించాలి గదా! 

ఆత్యధిక విప్లవ కమ్యూనిస్టు పార్టీలకు వ్యవస్థ, దాని మార్పు పట్ల ఒకే అవగాహన ఉంది (కొద్ది విప్లవ పార్టీలు పాత వైఖరి నుంచి వైదొలిగాయి). అనుసరించే ఎత్తుగడల్లో తేడాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు అతివాద విధానాలు అనుసరించాయి. అందువల్ల కలిగిన నష్టాలు ఉన్నాయి. అనుసరించిన కార్యాచరణ, వచ్చిన ఫలితాల నుంచి గుణపాఠాలు తీసుకుంటే విభేదాలు తొలగిపోతాయి. వ్యవస్థ మార్పుకు అంకితమైన ఈ పార్టీలు విడివిడిగానూ, ఉమ్మడిగానూ ఇలాంటి సమీక్షకు ముందుకు రావాలి.

ఐక్యతకు పునాది
పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్న పార్టీలు సోషలిజాన్ని కోరుకుంటున్నాయి. పార్లమెంటరీ విధానం ద్వారా సోషలిస్టు వ్యవస్థ సాధించవచ్చని చెప్పే ఈ పార్టీలు, పార్లమెంటరీ విధానంలో కూడా స్వతంత్ర విధానాన్ని అనుసరించడం లేదు. బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులే పార్లమెంటరీ విధానంగా ముందుకు పోతున్నాయి. అందుకు పొంతన లేని వివరణలు ఇస్తున్నాయి. ఎన్నికల ద్వారానే ఏ దేశంలో కూడా వ్యవస్థ సమూలంగా మార్పు చెందలేదు. మహనీయుడు లెనిన్‌ ‘రాజ్యాంగ యంత్రం – విప్లవం’ అనే తన రచనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మార్క్సిజం – లెనినిజం సిద్ధాంత వెలుగులో... ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలి, ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఉద్యమం వైపు ప్రజలను ఎలా సమీకరించాలి అన్న ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఆ విధంగా ఎన్నికల్లో పాల్గొనాలి.

కమ్యూనిస్టు ఉద్యమంలో రెండు పరస్పర విరుద్ధమైన విభాగాలు పని చేస్తున్నాయి. ఈ రెండు విభాగాలు తమ సిద్ధాంత వైఖరులకు కట్టుబడి ఉన్నాయి. అందువల్ల వీటి మధ్య వెంటనే ఐక్యత సాధ్యం కాదు. ఈ రెండు విభాగాల మధ్య నేటి వ్యవస్థ గురించి, విప్లవ దశ గురించి, బడా బూర్జువా గురించి ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడితే  రెండు విభాగాల మధ్య ఐక్యతా అవకాశాలు ఏర్పడతాయి.

వివిధ కమ్యూనిస్టు సంస్థలు, తమ తమ సిద్ధాంత అవగా హనను అట్టి పెట్టుకుంటూనే, ఉమ్మడి అవగాహన ఉన్న అంశాలపై ఐక్య కార్యాచరణ కొనసాగించాలి. ఇప్పటికే కొన్ని సమస్యల పట్ల ఐక్య కార్యాచరణ కొనసాగుతున్నది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద దీన్ని చూడవచ్చు. ఐక్య కార్యాచరణ అంశాలు ఇంకా విస్తరించాలి. గ్రామీణ ప్రాంతంలో పేదలకు భూ పంపిణీ, ఎరువుల, విత్తనాల సబ్సిడీ, కార్పొరేట్‌ వ్యవసాయాన్ని వ్యతిరేకించడం, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి నిరంతర ఐక్య కార్యాచరణ కొనసాగాలి. ఇదే కమ్యూనిస్టుల ఐక్యతకు పునాది.
- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతుకూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement