breaking news
gurajala srinivasa rao
-
రైట్‌కు మొగ్గుతున్న యూరప్?
ఈ నెల సెప్టెంబర్‌లో జర్మనీ, స్వీడన్లలో జరిగిన ఎన్నికల ఫలితాలు యూరప్‌లో జాతీయవాద రైట్‌వింగ్ పార్టీలు యూరప్ రాజకీయాలను శాసించబోతున్నాయనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని సాక్సోని– ఆన్హాల్త్ రాష్ట్రంలో ‘ఆల్టర్నేటివ్ ఫ్యూఆర్ డోయిచ్లాంట్’ (ఏఎఫ్‌డీ) పార్టీ ఘన విజయం పరిశీలకులను దిగ్భ్రమకు గురి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో మొట్టమొదటి సారి ఒక రాష్ట్రంలో రైట్‌వింగ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. సెప్టెంబర్ 13న స్వీడన్లో జరిగిన జాతీయ పార్లమెంటరీ ఎన్నిక లలో ప్రాథమిక ఫలితాల ప్రకారం రైట్‌వింగ్ కూటమికీ, వామపక్ష సెంట్రిస్ట్ కూటమికీ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. కేపిటలిస్ట్ పంథా వైపు...ఒకప్పుడు రైట్‌వింగ్ పక్షాలను దూరంగా ఉంచిన సెంట్రిస్ట్, వామపక్ష పాలక వర్గాలు వాటితో చేతులు కలిపి ఎన్నికలలో పాల్గొ నటానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని దేశాలలో రైట్‌వింగ్ పొలిటికల్ పార్టీలు ఇప్పటికే అధికారంలోనికి వచ్చాయి. ఇటలీలో మెలోని నాయకత్వంలో రైట్‌వింగ్ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. ఫిన్లాండ్, క్రొయేషియా, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్లలో ప్రభుత్వాలు రైట్‌వింగ్ పార్టీల మద్దతుపై ఆధారపడుతున్నాయి. యూరోపియన్ పార్లమెంటులో రైట్‌వింగ్ పార్టీల కూటమి రెండవ అతిపెద్ద కూట మిగా ఏర్పడింది. ఫ్రాన్స్‌లో రీఅసెంబెల్మెంట్ నేషనల్ పార్టీ, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడమ్, యూకేలో రీఫార్మ్ యూకే పార్టీ, ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ, అర్జెంటీనాలో లాలిర్టడ్ అవంజా వంటివి ఐరోపా, లాటిన్ అమెరికాలలో రైట్‌వింగ్ భావజాలానికి ప్రతీకలు. 1990వ దశకపు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఐరోపా, లాటిన్ అమెరికాలలోని వామపక్ష పార్టీలు కూడా క్రమంగా పెట్టుబడిదారీ (కేపిటలిస్ట్) పంథా వైపు మరలాయి. 2010 సంవత్సరంకల్లా లాటిన్ అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడి ఆహారం వంటి కనీస వస్తు వులకు కొరత ఏర్పడి ఉచిత సంక్షేమ పథకాల ప్రాతిపదికన ఏర్పడిన ప్రభుత్వాలు సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి. రైట్‌వింగ్ ఎదుగుతున్న తీరుఅగ్నికి ఆజ్యం తోడయినట్లు ఐరోపాలో ఆర్థిక సమస్యలకు వలసలు, వలసదారుల ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు, ఉనికి (ఐడెంటిటీ) భయాలు రైట్‌వింగ్ పార్టీలు, జాతీయ భావజాలానికి దోహద పడ్డాయి. మితవాద, వామపక్ష ప్రభుత్వాలు ఐరోపాలోకి విచక్షణా రహితంగా ఆసియా–ఆఫ్రికాల నుండి వలసలను అనుమతించాయి. రాడికల్ ఇస్లామిక్ భావజాలం వేళ్లూనుకున్న సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, అల్జీరియా, మొరాకో, నైజీరియా వంటి దేశాల నుండి వచ్చిన వలసదారుల పాత్రలో గ్యాంగ్ వార్లు, మెట్రోస్టేషన్లో పబ్లిక్ ప్రదేశాలలో బాంబు బ్లాస్టులు భద్రతా భయా లను లేవనెత్తాయి. వలస ప్రజలు యూరప్ నగరాలలో కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతమై సమాంతర సంస్కృతులను, సమాజా లను ఏర్పరచుకోవటం; కొన్ని సందర్భాలలో షరియాను పాటించటం, ప్రభుత్వాలకు సవాలుగా తయారయ్యాయి. వలస వచ్చిన వారు ఐరోపా సంస్కృతిలో సమ్మిళితమవకుండా తమ సంస్కృతి చిహ్నాలను బాహాటంగా ప్రదర్శించటం స్థానికులలో తమ సంస్కృతి ఉనికిపై సందేహాలు, అనుమానాలను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, స్థానిక సంస్కృతుల పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలు ప్రథమ కర్తవ్యమనే అజెండాతో వచ్చిన రైట్ వింగ్ రాజకీయ పక్షాలు ప్రజలను ఆకర్షించాయి. మితవాద, లిబ రల్, వామపక్ష పార్టీలలో వలస సంతతి పౌరులు కీలక స్థానాలను ఆక్రమించారు. స్థానిక సంస్కృతి అంతరించి పోతుందనే రైట్‌వింగ్ నినాదం స్థానిక సంతతి ప్రజలను చైతన్యపరిచింది. ఐరోపాలోని అనేక దేశాల వామపక్ష, లిబరల్ ప్రభుత్వాలు ఈ ప్రమాద ఘంటిక లను పసిగట్టి కొంత వరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి.2021లో సామ్‌సల్ పాటీ అనే ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ ఉగ్రవాది నరికి వేసిన సంఘటన తరువాత ఫ్రాన్స్ వేర్పాటువాద వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రార్థనా స్థలాలు, మత సంబంధిత పాఠశాలలు, మతప్రవచనాలు, మత సంస్థలకు విదేశీ నిధులపై నియంత్రణ, ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశా లలో ముఖాలపై ముసుగును నిషేధించింది. 2018లో డెన్మార్క్‌లో కూడా ముఖాలపై బహిరంగ ప్రదేశాలలో ముసుగును నిషేధించారు. జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశా లలో కూడా మత సంస్థలు, మత ప్రవచనాలు, మత సంప్రదాయా లను నియంత్రిస్తూ అనేక చర్యలను తీసుకున్నాయి. రైట్‌వింగ్ జాతీయవాద భావజాల వృద్ధి ఐరోపా విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. వలస, ఆర్థిక, విదేశాంగ, పర్యావ రణ, సాంస్కృతిక విధానాలలో పెను మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఇటలీ వలస శరణార్థులను ఆల్బేనియాకు పంపించే ప్రయ త్నాలు చేస్తున్నది. టిడో ఒప్పందం కింద స్వీడన్, పౌరసత్వం, డీపోర్టేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. అర్జెంటీనాలో మీలి ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పలు ఆర్థిక మదుపు చర్యలను చేపట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీలు యూరోపియన్ యూనియన్ను సంస్కరించాలని పట్టుబడుతున్నాయి. రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఆస్ట్రియా వ్యతిరేకిస్తున్నది. రైట్‌వింగ్ పార్టీలు ‘గ్రీన్ ఎనర్జీ’ సిద్ధాంతాన్ని ఆమో దించటం లేదు. కర్బన ఉద్గారాలను నియంత్రించే చర్యలను సమ ర్థించటం లేదు. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, పోలండ్లు ఇప్పటికే రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాల నుండి పక్కకు వచ్చి బొగ్గు, సహజ వాయువు, చమురు వంటి శిలాజ ఇంధనాలు, అణు ఇంధ నాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఎల్జీబీటీ, సరోగసీ, అబార్షన్ వంటి సున్నిత సామాజిక అంశాలలో రైట్‌వింగ్ భావజాల ఒత్తిడితో హంగరీ, ఇటలీ, పోలండ్ వంటి దేశాలు కఠిన చట్టాలు, నిబంధన లను తీసుకుని వచ్చాయి. భారత్‌పై ప్రభావం ఏమిటి?ఐరోపాలో రైట్‌వింగ్ భావజాలం వల్ల భారతదేశంపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలించాలి. దౌత్యపరంగా ఇది భారత్‌కు ఒక రకంగా స్వాగతించదగిన అంశం. దశాబ్దాలుగా ఐరోపా దేశాలు, యూఎస్ఏ... భారత్ అంతర్గత విషయాలైన మైనారిటీ హక్కులు, మత అంశాలు, మానవ హక్కులపై మనకు ఉపన్యా సాలు, ప్రవచనాలు వినిపించేవారు. తమదాకా వచ్చేదాకా తెలియ దన్నట్లు ఐరోపాకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నది. ఈ అంశా లలో భారత్‌పై ప్రపంచ స్థాయిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది. రైట్‌వింగ్ పార్టీలు ఐరోపా పర్యావరణ సుంకాలను వ్యతిరేకించటం కూడా మనకు కలిసివచ్చే అంశం. ఉదాహరణకు ఐరోపా అవలంబిస్తున్న ‘కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎమ్) తొలగిస్తే ఉక్కు, అల్యూమినియం వంటి భారత ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. అయితే ఐరోపా– భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవచ్చు. కఠిన వలస విధానం వల్ల భారత విద్యార్థులు, ఐటీ నిపుణులు ఐరోపాలోకి ప్రవేశించటం కష్టమయ్యే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మక్కా కూటమిని ఎలా చూడాలి?
పాకిస్తాన్ చొరవతో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా సభ్యులుగా గత నెలలో మక్కాలో ఒక కొత్త సైనిక కూటమికి అంకురార్పణ జరిగింది. ఈ కూటమిని ‘ఇస్లామిక్ నాటో’ అని కూడా అభివర్ణిస్తు న్నారు. నెల తిరగకుండానే, ఈ నెల మొదటి తారీఖున మళ్లీ ఈ మూడు దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధ్యక్షులు సమావే శమై కూటమి సెక్రటేరియట్, విధివిధా నాల మీద చర్చించారు. ఉమ్మడి భద్రత లక్ష్యంగా ఏర్పడిన ఈ సైనిక కూటమిని నాటో తరహాలో రూపొందించటానికి ప్రయత్నం జరుగుతున్నది. నాటో కూటమి ఒప్పందం ఆర్టికల్ ‘5’ ప్రకారం, కూటమి ఏ ఒక్క సభ్య దేశంపైన దాడి జరిగినా దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి సైనిక కూటమి తన పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుంది. మక్కా ఒప్పందంలో కూడా ఈ తరహా క్లాజును పొందుపరచటం విశేషం. కారణాలేమిటి?స్థూలంగా పరిశీలిస్తే ఈ కూటమి ఏర్పాటుకు ఇరాన్ యుద్ధంలో సౌదీ, కువైట్, బెహ్రయిన్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల వలన జరిగిన నష్టం ప్రథమ కారణంగా కన్పడు తున్నది. పర్షియా సింధు శాఖలోని రియాద్, ఫుజేరా, కువైట్, దుబాయ్ వంటి నగరాలు; చమురు శుద్ధి కేంద్రాలు, డీసాలినేషన్ ప్లాంట్లు ఇరాన్ మిస్సైల్స్, డ్రోనుల దాడి నుండి తప్పించుకోలేక పోయాయి. సౌదీ, యూఏఈ, బెహ్రయిన్ దేశాలలోని నాటో సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. యూఎస్ఏ ఏర్పాటు చేసిన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దేశాలకు పూర్తి రక్షణను కల్పించ లేకపోయాయి. అమెరికన్ సైనిక స్థావరాలుండటమే, ఈ దేశాలపై ఇరాన్ దాడి చేయటానికి కారణం. యుద్ధం ఇరాన్–అమెరికా/ ఇజ్రా యెల్ మధ్య జరుగుతున్నప్పటికీ, గల్ఫ్ దేశాలు అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుకుపోయాయి. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కొనే సైనికశక్తి ఈ దేశాలకు లేదు. అమెరికన్ భద్రతా గొడుగు నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా తమకొక ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. అయితే సౌదీపై హౌతీల దాడులు జరిగినప్పటికీ ఆర్టికల్ 5ని ఆచరణలోకి తేలేదు. అది అంత సులభం కాదు.ఈ కూటమి కేవలం అమెరికన్ నాయకత్వంలోని నాటోకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ప్రాంతీయ కూటమి కాకపోవచ్చు. పాకిస్తాన్, టర్కీ పర్షియా సింధు శాఖలోని దేశాలు కాదు. ఈ మూడు దేశాలు సున్నీ ముస్లిమ్ దేశాలు. ఇరాన్, ఇరాక్ షియా ముస్లిం దేశాలు. పర్షియా సింధుశాఖలోని యూఏఈ ఈ కూటమిలో ప్రస్తుతానికి లేదు. సౌదీ, యూఏఈలకు వ్యూహాత్మక లక్ష్యాలలో వైరుధ్యం ఉన్నది. ఈ రెండు దేశాలు యెమెన్‌లో రెండు సైనిక గ్రూపులను సమర్థిస్తున్నాయి. పాలస్తీనా సమస్యలో ఈ రెండు దేశాల వైఖరిలో అంతరమున్నది. యూఏఈ అబ్రహాం ఒప్పందంపై సంతకం చేసి ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవ టానికి మొగ్గు చూపుతున్నది. సౌదీ అరేబియా సంతకాలకు నిరాక రిస్తున్నది. ఈ మూడూ అమెరికాకు నమ్మకమయిన స్నేహితులు.ఉమ్మడి శత్రువు లేని కూటమిపాకిస్తాన్కు సుశిక్షితమైన విస్తృత సైనిక బలగం ఉన్నది. ఇప్ప టికే పాక్ సైనికులు సౌదీలో విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నది. గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ అణ్వస్త్ర ముప్పును ఎదుర్కోవటానికి అణ్వస్త్రాల సహాయం అవసరం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగానే అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడికి అణుబూచినే ముందు ఉంచుతున్నారు. టర్కీ వద్ద సైనిక విమానాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి తయారీ సామర్థ్యం విస్తృతంగా ఉన్నది. నాటో సభ్యదేశం కావటంతో ఆధునిక యుద్ధ రీతులు, యుద్ధతంత్రాలు టర్కీకి సుపరిచితం. సౌదీ అరేబియా వద్ద పుష్కలంగా పెట్టుబడి సామర్థ్యం ఉన్నది. కీలకమైన చమురు, సహజ వాయువు నిల్వలున్నాయి. ఈ మూడు దేశాలు చేతులు కలపటంతో బలమైన సైనిక శక్తి ఆవిర్భవించే అవకాశమున్నది.అయితే, లక్ష్యాలపరంగా కూటమిలోని మూడు దేశాల మధ్య వైరుధ్యం స్పష్టంగా కనబడుతోంది. సైనిక కూటములకు సహజంగా ఉమ్మడి శత్రువులుంటారు. ఉదాహరణకు నాటో కూటమికి బద్ధ శత్రువు పూర్వపు సోవియట్ యూనియన్, తరువాత రష్యా. కానీ మక్కా కూటమిలోని సౌదీ అరేబియాకు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రథమ శత్రువులు. సౌదీ దృష్టంతా పర్షియా సింధుశాఖ, ఎర్ర సముద్రాల పైన ఉంటుంది. టర్కీకి ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు. టర్కీ తన శక్తియుక్తులను తూర్పు మద్యధరా సముద్రం, సిరియా, జోర్డాన్, లెబనాన్లపైన కేంద్రీకరిస్తుంది. పాక్‌కు మధ్యప్రాచ్యంలో ప్రత్యేకంగా శత్రువులెవరూ లేరు. ఇరాన్‌తో కూడా మిత్రత్వ వైఖరినే అవలంబిస్తుంది. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించినప్పటికీ, శత్రువుగా చూడదు. పాకిస్తాన్‌కు భారతదేశమే లక్ష్యం, శత్రువు. కచ్చితమైన ఉమ్మడి శత్రువు లేకపోవటం కూటమికి పెద్ద బలహీనత.భారత్‌కు సవాలుఅమెరికన్ భద్రతా ఛత్రానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలు తమకంటూ ప్రత్యేకంగా ఒక సైనిక కూటమిని ఏర్పరచుకోవటం స్వాగతించదగినదే. కానీ పర్షియన్ సింధుశాఖ ప్రాంతానికి సంబంధం లేని ప్రాంతీయేతర శక్తులు ఇరాన్‌కు వ్యతి రేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయటం, దానికి పాకిస్తాన్, టర్కీ పునాదిరాళ్లు కావటం భారత్ ప్రయోజనాలకు ప్రమాదకరం. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్–టర్కీ రెండూ జతకట్టి భారత్‌పై దాడి చేశాయి. టర్కీ ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు కశ్మీర్ విషయంలో భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఆప రేషన్ సిందూర్‌లో పాక్‌కు పెద్ద మొత్తంలో డ్రోన్లను, మొబైల్ కమాండ్ సెంటర్లను, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని సమకూర్చింది.మక్కా కూటమి మత ప్రాతిపదికన ఏర్పడటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ కూటమిని ఇస్లామిక్ నాటో లేదా సున్నీ నాటోగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మతఛాందస ఇస్లా మిక్ టెర్రరిజం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ప్రమాదం. కానీ ఈ సైనిక కూటమిని అమెరికా సమర్థించటం కొసమెరుపు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో కూటమిని విస్తరించ టానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈజిప్ట్, ఖతార్, బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా వార్త లొస్తున్నాయి. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వం పాక్, చైనాలకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ, టర్కీలు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపే దుశ్శకునాలు కన్పడుతున్నాయి. జియోపాలిటిక్స్‌లో ఏదైనా జరగ వచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఈ కూటమి అడుగులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కూటమికి ప్రతిగా భారత్ చొరవ తీసుకొని యూఏఈ, ఇజ్రాయెల్, జపాన్‌లతో చేయికలిపి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్‌ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్‌లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్‌పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్‌లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్‌పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్‌లో భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్‌లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్‌పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్‌పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్‌కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్‌ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్‌ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్‌తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్‌కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్‌ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఐరోపా వలస సంక్షోభం
జూలై 30న మద్యధరా సముద్ర తీరంలో మొరాకో అంచున ఉన్న స్పానిష్ ఎన్క్లేవ్ స్యూటాలోకి ఒక్కసారిగా 50 వేల నుండి 60 వేల మంది మొరాకన్లు సము ద్రాన్ని ఈదుకుంటూ రావటం, సుమారు 72 మంది మృత్యువాత పడటం, స్పెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించటం ఒక్కసారిగా సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. గత సంవత్సర కాలం నుండి అమెరికాలో ‘ఐస్’ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు వలస దారులపై చేస్తున్న దాడులు చర్చనీయాంశమయ్యాయి. స్వదేశంలో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణంగా అనేక వేలమంది ప్రాణాలకు తెగించి ఏదో రకంగా ఐరోపా దేశాలకు చేరుకోవటానికి సాహసం చేస్తున్నారు. అటు అంతర్యుద్ధాలు ఇటు శ్రామిక కొరతసిరియా, లిబియా, అఫ్గాన్, ఇరాక్, ఎరిట్రియాలలో అంతర్యు ద్ధాల వలన ఒక మిలియన్‌కు పైగా శరణార్థులు ఒక్కసారిగా 2015లో ఐరోపాలోకి ప్రవేశించారు. దీనిని 2015 ఐరోపా శరణా ర్థుల సంక్షోభంగా పేర్కొంటారు. ఈ శరణార్థుల చొరబాటు ప్రధా నంగా మూడు మార్గాల గుండా జరిగింది. 1. తూర్పు మద్యధరా సముద్రంలో టర్కీ నుండి గ్రీకుకు చెందిన లెస్బాస్, చియోస్ దీవుల గుండా ఐరోపాలోకి. 2. పశ్చిమ బాల్కన్ ప్రాంతంలో మెసడోనియా నుండి సెర్బియా, హంగరీ, క్రొయేషియాల గుండా జర్మన్, ఆస్ట్రియా, స్కాండినేవియా ప్రాంతానికి. 3. మధ్య మద్యధరా ప్రాంతంలో లిబియా నుండి ఇటలీగుండా ఐరోపాలోనికి. ఐరోపా దేశాల ఉదారవాద విధానాల వలన అక్రమ వలస దారులు ఒకసారి ఐరోపాలోనికి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు పంపటం సాధ్యం కాదు. వీరి దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటా నికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఐరోపా దేశాల సంక్షేమ పథకాల ఆలంబనతో వీరు ఏదోరకంగా ఐరోపాలో స్థిరపడుతుంటారు.ఐరోపా దేశాలలో కనీసం 2.5 మిలియన్ల శ్రామికుల కొరత ఉన్నది. ఐరోపా జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. చౌక శ్రామిక శక్తి ఆవశ్యకతను గుర్తించి ఐరోపా దేశాలు వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. 2020 కంటే ముందు ఐరోపా దేశాలు శరణా ర్థులు, అక్రమ వలసదారుల ఎడల మెతక వైఖరిని అవలంభించాయి. ముఖ్యంగా జర్మనీ (ఆంజిలా మెర్కెల్ ప్రభుత్వం) కేవలం 2015లోనే 8.9 లక్షల శరణార్థులను అనుమతించింది. ఐరోపా దేశాలు అక్రమ వలసదారులను నియంత్రిస్తూ, వారిని క్రమంగా ఐరోపా సంస్కృతిలో విలీనం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు పరచాయి. యూకే, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాలు శరణార్థులు వారి సంస్కృతిని కాపాడుకోవటానికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ మతబోధనల పాఠశాలల ఏర్పాటుకు కూడా సహకరించాయి. వీరికి పౌరసత్వం ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్ దీనికి విరుద్ధంగా ఫ్రెంచ్ భాషను తప్పనిసరి చేసింది. పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలలో మతసంబంధ చిహ్నాలను నిషేధించింది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు నైపుణ్యంగల వలస దార్లను మాత్రమే అనుమతించటానికి ప్రాధాన్యతనిచ్చాయి. పౌరసత్వ సదుపాయం కల్పించలేదు.నియంత్రణల కసరత్తు2020 తర్వాత ఐరోపా దేశాలలో ఉగ్రవాద చర్యలు, హింసా త్మక సంఘటనలలో వలసదారుల ప్రమేయం బయటకు రావటంతో ఐరోపా దేశాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవటం మొదలెట్టాయి. స్వీడన్లో గ్యాంగ్‌వార్స్, 2024లో యూకేలో దొమ్మీలు, 2023లో ఫ్రాన్స్‌లో అల్లర్లు, యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ లపై నివేదికలు వలసలను వ్యతిరేకించే రైట్‌వింగ్ రాజకీయ పక్షాలు బలోపేతమవటానికి దోహదం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో సుమారుగా 6.4 కోట్ల మంది విదేశాలలో జన్మించినవారు. మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 13.3 శాతం. ప్రతి సంవత్సరం సుమారు 6.7 లక్షల శరణార్థులు వస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసు కొనేవరకు ఐరోపా బయట వేరే దేశాలలో ఉంచే పథకాన్ని ప్రారంభించాయి. రువాండా, అల్బేనియా, ట్యునీషియాలో వీరిని క్యాంపు లలో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వలసదారులకు స్థానిక భాష, సంస్కృతిపై అవగాహనను నిర్ధారించే పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. స్కాండినేవియన్ దేశాలలో వలస వచ్చిన వారిని సంక్షేమ పథకాల నుండి మినహాయిస్తున్నారు. స్వీడన్లో శరణార్థులు నివసిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నేరా లతో సంబంధమున్న వారిని దేశం నుండి బహిష్కరిస్తున్నారు. భద్రతా కారణాలు, సాంస్కృతిక–రాజకీయ నేపథ్యంలో ఐరోపా దేశాలు వలసలను నియంత్రించటానికి ప్రయత్నించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వలసలను పూర్తిగా నిషేధిస్తే ఐరోపా ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు. ముఖ్యంగా హెల్త్‌కేర్ రంగంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఎల్డర్లీ కేర్ రంగాలలో తీవ్ర కొరత ఉన్నది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ రంగాలలో డ్రైవర్లు, మెకానిక్‌లు, క్రేన్ ఆపరేటర్ల కొరత ఉన్నది. నిర్మాణ రంగంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లకు కొరత ఉన్నది. ఇండియాకు ఐరోపా ద్వారాలుప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది తమ మాతృదేశాల నుండి వలస వెళ్లి ఇతర దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరి వాటా 3.7 శాతం. వీరంతా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందినవారు. ప్రధానంగా యూఎస్ఏ, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తున్నారు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. భారత్ అక్రమ వలసలను, చొరబాట్లను ఏ రకంగానూ సమర్థించదు. అయితే చట్టబద్ధ వలసల విషయంలో ట్రంప్ వైఖరి భారత్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నది. హెచ్1బీ వర్క్ వీసాలలో భారత్ వాటా 70 శాతం. హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ వర్క్ వీసాల నిబంధనలతో బాటుగా అమెరికాలో జన్మించినవారికి లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే యత్నాలు భారత్‌కు నిరాశను కలిగిస్తున్నాయి.ఇవి ఒక రకంగా కొత్త అవకాశాలకు దారి తెరిచే అవకాశం ఉన్నది. 2023లో 9 లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెళితే 2025లో 6.26 లక్షలమంది మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపారు. వీరు కూడా యూఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ లేదా ఐరోపా విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అమెరికా నుండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ సూచనలు కన్పడుతున్నాయి. అమెరికన్ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫ్ షోరింగ్ స్థానంలో ఆన్ షోరింగ్ ప్రారంభమవుతున్నది. భారతీయుల అమెరికన్ డ్రీమ్ చెదిరిపోయే తరుణంలో ఐరోపా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సంబంధాలలో వాణిజ్యాన్ని – వలసలను కలిపి ప్రతిపాదిస్తున్నది. ఇండియా – ఈయూ మొబిలిటీ పాక్ట్ (2026)పై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత విద్యార్థుల వీసాలను ఫాస్ట్‌ట్రాక్ చేయటం, ఐరోపా విశ్వవిద్యా లయాలలో భారతీయ విద్యార్థులు కోర్సు ముగించిన తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి 12 నెలల వీసా అనుమతికి వీలున్నది. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మానుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ,హెల్త్ కేర్ రంగాలలో భారతీయులకు వర్క్ వీసాలకు ఐరోపా దేశాలు అనుమతిస్తాయి. అమెరికాలో వీసా నిబంధనల సమస్యల నేపథ్యంలో ఐరోపా వలస సంక్షోభం, ఘర్షణలు భారత్‌కు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. బహుశా 2050 కల్లా ఐరోపా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలలో భారతీయులు తమదైన ముద్రను వేసే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్‌లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్‌కు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్‌గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్‌ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్‌తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్‌లోని బలూచిస్తాన్, ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్‌లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్‌పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్‌లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్‌ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్‌లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్‌లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్‌ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్‌లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్‌లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్‌పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్‌లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఆఫ్రికా నుండి ఫ్రెంచ్ నిష్క్రమణ?
గత నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్ తరువాత ఫ్రాన్స్ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొందింది.ఫ్రాన్స్ తీరు వేరు!వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్ సైన్యం ఆప రేషన్ సెవాల్ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్లో ఒమర్ బాంగో, చాద్‌లో డెబీ ఫ్రెంచ్ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్ సైనికులను వినియోగించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్ వలస దేశాలు సీఎఫ్ఏ ఫ్రాంక్ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్‌ను ఫ్రెంచ్ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్ రంగాలను ఫ్రెంచ్ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్ దేశాలు ఫ్రెంచ్ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.2020 తరువాత ఫ్రాన్స్ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్ల నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. పెరుగుతున్న చైనా ప్రభావంఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్‌లోని యురేనియం, గినియాలోని బాక్సైట్ గనుల నుండి ఫ్రెంచ్‌కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్జాన్ (ఐవరీ కోస్ట్), పాయింట్ నాయిర్ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్ (గాబన్)లతో పాటుగా యురేనియం (నైజర్), చమురు, గ్యాస్ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.మనకో సువర్ణావకాశంభారత్కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్‌కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్‌ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్‌కు ప్రతికూలాంశం.ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్ యూనియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్ ముందున్న మార్గం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్‌ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్‌ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్‌తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్‌లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్‌లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్‌లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్‌లోని పిరేస్, ఫ్రాన్స్‌లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్‌ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్‌ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్‌కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్‌కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్‌ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్‌కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్‌కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్‌తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్‌కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్‌కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్‌ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్‌కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్‌కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్‌తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!
వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్ కవర్ ఆపరేషన్) ఆరోపించారు. సంబంధాలలో సరికొత్త అధ్యాయంమార్క్ కార్నీ ప్రధాని కాగానే భారత్‌తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్‌లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్‌లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.భారత్–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ 2070 కల్లా నెట్–జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్‌లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడాకెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్ సరస్సు, మెక్– ఆర్థర్ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్– కెనడాల మధ్య 2.5 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మోనజైట్ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్‌ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్‌కు లేదు. ముడి మోనజైట్‌ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్‌కు వచ్చారు. భారత్‌లో కెనడియన్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు, భారత్–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్ హైడ్రోజన్ క్వాంటమ్ మెకానిక్స్ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.సుంకాల రద్దుకు సమాలోచనలుఆర్కిటిక్, పసిఫిక్ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్ కెనడియన్ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ భారత్‌కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్‌బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్‌లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్‌లోని డెయిరీఫామ్‌లు పాల ప్రాసెసింగ్‌కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్‌లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్‌లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్‌లోని మిచిగన్‌కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్‌చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్‌తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్‌కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
నవ భారత యుద్ధ తంత్రం
భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్ సిందూర్’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్‌ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్హక్ ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ (వెయ్యి గాట్లతో భారత్‌ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్‌లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. పాక్‌పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్‌ను క్రమంగా ఆ న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్ బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్ఓసీ దాటి ఉరి, బాలాకోట్‌లలో ఆప రేషన్లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్ గామ్ దాడితో పాక్ నేరుగా భారత్‌కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికీ ‘భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. డీఆర్డీఓ, ఇస్రోలతో సమన్వయం!ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు; పాకిస్తాన్లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు ప్రతిగా కశ్మీర్ నుండి కచ్ వరకు పాక్ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్ న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్‌లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. రావల్పిండిలో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, సిం«ద్ ప్రావిన్స్‌లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్ వైమానిక స్థావరం, రహీమ్ యార్ ఖాన్ సైనిక స్థావరాలతో సహా పాక్‌లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్ సిందూర్‌ను సమర్థవంతంగా నడిపించాయి.ఆపరేషన్ సిందూర్‌లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్‌లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. సిందూర్ 2.0కు సిద్ధమా?పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్‌కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో చైనా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్‌లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు, యూఎస్ఏ, ఇజ్రాయెల్‌లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్‌లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. వ్యూహంలో భాగమే ‘రింగ్’ అలర్ట్దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్‌ఫోన్ రింగ్ అలర్ట్’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్‌లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'రణక్షేత్రం' ఇండో పసిఫిక్‌కు మారేనా?
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండో– పసిఫిక్‌లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్‌టీ) నాయకురాలు చెంగ్–లీ–వున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్‌పింగ్ కేఎమ్‌టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. తైవాన్ విలీనమే చైనా లక్ష్యంతైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్ఏ పార్ల మెంట్ స్పీకర్ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్ఏ తైవాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్ ప్రధాని సానయి తకాయిచి తైవాన్‌పై చైనా దాడి చేస్తే దానిని జపాన్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్ యుద్ధంలో జపాన్ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్నే అడ్డా!రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 1945లో తైవాన్ దీవులను జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్సీ– ఆర్‌ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్ ఉత్పత్తులలో తైవాన్ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. నేరుగా అమెరికాకు సవాలు!1997లో హాంకాంగ్ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్‌కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్‌లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్మెంట్) జరిగింది. అప్పుడు తైవాన్‌లో అధికారంలో ఉన్న కేఎమ్‌టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్‌ఫ్లవర్ మూవ్మెంట్) జరిగింది. హాంకాంగ్ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్ – రేపు తైవాన్’ నినాదం కింద తైవాన్‌కూ హాంకాంగ్ గతి పడుతుందని తైవాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్‌ల మధ్య జియో పొలిటి కల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్ శాసిస్తుందని జియో పొలిటికల్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్‌పింగ్ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్ఏకు సవాలు విసురుతున్నాయి.1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్‌తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘ఈ తరంలోనే తైవాన్ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్‌పింగ్ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. భారత నౌకాశక్తి కీలకంసైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్ దీవులు. జపాన్ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్), ఫిలిప్ఫైన్స్లలో యూఎస్ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్‌లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్ఏ, జపాన్ సభ్యులుగా 2004లో క్వాడ్ ఏర్పడింది. క్వాడ్‌ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే సభ్యులుగా ఆకస్ కూటమి పనిచేస్తున్నది.ఉత్తర పసిఫిక్ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్‌కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్ఏ–జపాన్ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్‌లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్‌తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్‌కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్‌ల్యాండ్‌ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్‌లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్‌పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్‌ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్‌ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్‌కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్‌ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్‌ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్‌తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్‌కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్‌కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్‌కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్‌కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్‌తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్‌కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్‌లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
విశ్లేషణలో సమతూకం.. మెరుగైన స్కోరింగ్‌కు మార్గం!
గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ. Writing is an beautiful అట్ట.. రాయటమనేది ఓ అందమైన కళ.. ఓ అంశానికి సంబంధించి మదిలోని భావాలకు అక్షరరూపం ఇచ్చి ఎగ్జామినర్‌ను మెప్పించడమనే ఉన్నత కళ.. విద్యార్థులకు విజయాలను దగ్గరచేస్తుంది. సివిల్స్ మెయిన్స్‌లో కీలకమైన పేపర్ ఎస్సే.. 250 మార్కులకు ఉండే ఈ పేపర్లో అధిక మార్కులు సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు అన్ని కోణాల్లోనూ విశ్లేషణాత్మకంగా రాయగలిగే నేర్పును సొంతం చేసుకోవాలి.. ఈ నేపథ్యంలో ‘జనరల్ ఎస్సే’ పేపర్‌కు సంబంధించి ప్రిపరేషన్ ప్రణాళిక.. సివిల్స్ మెయిన్స్‌లో మెరిట్ స్కోరింగ్‌కు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో ఎస్సే పేపర్ కీలకమైనది. ఓ ప్రణాళిక ప్రకారం పరీక్షకు సిద్ధమైతే ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు అవకాశముంటుంది. ఇచ్చిన అంశాన్ని నిశితంగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణాత్మకంగా రాస్తే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకుంటుంది. ఇలాంటి ఎస్సే రాసేందుకు అభ్యర్థులు తగిన ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. విభాగాల ఎంపిక: సివిల్స్ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఎస్సే ప్రిపరేషన్లో భాగంగా సామాజిక (Social); పర్యావరణం (Environment); ఆర్థిక (Economic); జాతీయ/అంతర్జాతీయ (National/International) ఇలా నాలుగైదు విభాగాలను గుర్తించాలి. కనీసం రెండు అంశాల్లో పట్టు: గుర్తించిన నాలుగైదు విభాగాలకు సంబంధించి ఐదు వరకు అంశాలను నోట్ చేసుకోవాలి. అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కనీసం రెండు అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకునేటప్పుడు అభ్యర్థులు తమ అభిరుచి, అకడమిక్ నేపథ్యం, మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టు తదితరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎంపిక చేసుకున్న రెండు అంశాల నుంచి ఒక్కో దాన్నుంచి ఏడెనిమిది ఉప అంశాలను, మొత్తంమీద 15- 20 ఉప అంశాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి దానికీ సంబంధించిన సమస్యలు, సవాళ్లు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, సమస్య పరిష్కారానికి అనుసరించే వ్యూహాలను చదవాలి. వీటికి అభ్యర్థులు.. ప్రభావవంతమైన, సానుకూల దృక్పథంతో కూడిన సొంత అభిప్రాయాలను జోడిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. విపత్తులు అనే అంశం నుంచి వరదలు అనే ఉప అంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఉప అంశాన్ని సమకాలీన సంఘటనలకు అనుసంధానిస్తూ విశ్లేషణాత్మకంగా చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇలా చదివితే పరీక్షలో ‘ఉత్తరాఖండ్’ వరదలకు సంబంధించి ఏ కోణంలో ప్రశ్న అడిగినా తేలిగ్గా ఎస్సే రాయడానికి అవకాశముంటుంది. ఇలా వివిధ ఉప అంశాలను గుర్తించి సమకాలీనంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టు నిపుణుల సలహాతో: గతంలో మాదిరి ఇప్పుడు నేరుగా ప్రశ్నలు రావడం లేదు కాబట్టి ఆయా ఉప అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు అభ్యర్థులు సబ్జెక్టు నిపుణులను సంప్రదించాలి. వివిధ ప్రశ్నలకు సంబంధించి ఎస్సేలు రాసి వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. చేసిన పొరపాట్లను తెలుసుకొని వ్యాసాన్ని మరింత మెరుగ్గా రాయడానికి ప్రయత్నించాలి. ప్రిపరేషన్‌కు దినపత్రికలు, వెబ్సైట్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఆ రెండు ఆప్షనల్స్‌కు బోనస్: మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఇతర ఆప్షనల్ సబ్జెక్టు తీసుకున్న వారితో పోలిస్తే జాగ్రఫీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న వారికి ఎస్సే పేపర్ బోనస్ అని చెప్పొచ్చు. వీరు ఆప్షనల్ ప్రిపరేషన్లో భాగంగా చదివే వివిధ అంశాలు ఎస్సేను ప్రభావవంతంగా రాయడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సంస్కృతి, నాగరికత: ఇచ్చిన ప్రశ్నల్లో ఒకటి సంస్కృతి, నాగరికత, కళలు, ఫిలాసఫీ తదితర అంశాల నుంచి వస్తుంది. చాలా వరకు ఇది సమకాలీనంగా చర్చలో ఉన్న విషయానికి సంబంధించినదై ఉంటుంది. ఈ ఎస్సే రాయగల సామర్థ్యం కొంత మందికే ఉంటుంది. సృజనాత్మకంగా విశ్లేషించే నైపుణ్యం, భాష మీద పట్టున్న వారు మాత్రమే ఇలాంటి ఎస్సేను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సామర్థ్యం లేకుండా ఎస్సేను రాయడానికి సిద్ధపడితే కోరికోరి చేతులు కాల్చుకోవడమే అవుతుంది. జాతీయ, అంతర్జాతీయ విభాగానికి సంబంధించి పొలిటికల్, భద్రతలకు సంబంధించి ప్రశ్న కచ్చితంగా వచ్చేందుకు అవకాశముంది. Ex: వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ దేశ పోకడలకు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు రష్యా.. అమెరికా చర్యల్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా సిరియాలో రసాయన ఆయుధాల సంక్షోభం నేపథ్యంలో అమెరికా అవలంబిస్తున్న వైఖరిని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని (Foreign policy) ఏ విధంగా మార్చుకోవడం అభిలషణీయమో వివరించండి? అనే ప్రశ్న రావొచ్చు. ప్రశ్న ఎంపిక ఎలా? అభ్యర్థులు ఎంపిక చేసుకునే ప్రశ్న అధిక మార్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అభ్యర్థులు సరైన సమాచారాన్ని చొప్పించేందుకు, వివిధ ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్ననే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నను ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ట మార్కులు సంపాదించేందుకు వీలవుతుంది. సమయ పాలన ప్రధానం: జనరల్ ఎస్సే విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం సమయ పాలన. ఈ క్రమంలో ప్రశ్నను ఎంపిక చేసుకున్న తర్వాత కొంత సమయాన్ని వ్యాసంలో పొందుపరచాల్సిన అంశాల వరుస క్రమంతో స్ట్రక్చర్‌ను రూపొందించుకునేందుకు కేటాయించాలి. ప్రశ్నలో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్యకు మూలాలు ఏమిటి?; పూర్వ, ప్రస్తుత స్థితి; సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు-వ్యూహాలు; అవి ఎంత వరకు సఫలీకృతమయ్యాయి? వంటి అంశాలతో ప్రణాళిక రూపొందించుకోవాలి. దీని ఆధారంగా ఎస్సే రాయాలి. ప్రారంభం ఆకట్టుకోవాలి: చాలా మంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. దీంట్లో భాగంగా ప్రశ్నకు సంబంధించిన ఎస్సేను సమకాలీన నేపథ్యంతో ప్రారంభించాలి. ఉదాహరణకు ప్రశ్న ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలకు సంబంధించినది అయితే ఇటీవల బీహార్‌లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం- చిన్నారుల మరణాల ఘటనతో ప్రారంభించాలి. ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు వేయాలి. మొదటి పేజీ పేరాల్లో సరళమైన పదాలు, సూటిగా, స్పష్టమైన వివరణలు ఉండేలా చూడాలి. ఇతరులతో పోల్చితే భిన్నంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉంటే ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రాత తీరు.. ఉండాలిలా! అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి. ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. పొంతనలేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూడాలి. సందర్భాన్ని బట్టి అవసరమైనంతలో మంచి కొటేషన్స్, సామెతలు ఉపయోగించవచ్చు. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఇలాంటివి పేజీలో రెండు లేదా మూడు అంశాలకు పరిమితం చేయాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు. ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఈ కింది ఉదాహరణ ద్వారా ఎస్సే పేపర్లో సమకాలీనతకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. Ex: In the context of Gandhiji's views on the matter, explore, on an evolutionary scale, the terms "Swadhinata', "Swaraj', and "Dharmarajya'. Critically comment on their contemporary relevance to Indian democracy. (2012 సివిల్స్ మెయిన్స్) ఎస్సే పేపర్లో వచ్చే అవకాశమున్న కొన్ని అంశాలు: ఉత్తరాఖండ్ వరద బీభత్సం. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువలో అధిక క్షీణత. నిర్భయపై సామూహిక అత్యాచారం కేసు- దోషులకు మరణ శిక్ష విధింపు. ఆహార భద్రత చట్టం అమలు-సాధ్యాసాధ్యాలు. దేశ ఆర్థికాభివృద్ధిపై అవినీతి కుంభకోణాల ప్రభావం.


