నవ భారత యుద్ధ తంత్రం | Sakshi Guest Column On Operation Sindoor one year | Sakshi
Sakshi News home page

నవ భారత యుద్ధ తంత్రం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

Sakshi Guest Column On Operation Sindoor one year

విశ్లేషణ

ఆపరేషన్‌ సిందూర్‌కు ఏడాది 

భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్‌ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్‌హక్‌ ‘బ్లీడ్‌ ఇండియా బై థౌజండ్‌ కట్స్‌’ (వెయ్యి గాట్లతో భారత్‌ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్‌ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్‌లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. 

పాక్‌పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్‌ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్‌ను క్రమంగా ఆ న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్‌ బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్‌ఓసీ దాటి ఉరి, బాలాకోట్‌లలో ఆప రేషన్‌లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్‌ గామ్‌ దాడితో పాక్‌ నేరుగా భారత్‌కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్‌కే కాకుండా యావత్‌ ప్రపంచానికీ ‘భారత్‌ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. 

డీఆర్‌డీఓ, ఇస్రోలతో సమన్వయం!
ఆపరేషన్‌ సిందూర్‌ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు; పాకిస్తాన్‌లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్‌ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్‌ దాడులకు ప్రతిగా కశ్మీర్‌ నుండి కచ్‌ వరకు పాక్‌ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్‌ న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్‌ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్‌ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్‌లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్‌ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసింది. 

రావల్పిండిలో పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరం, సిం«ద్‌ ప్రావిన్స్‌లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్‌–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్‌ వైమానిక స్థావరం, రహీమ్‌ యార్‌ ఖాన్‌ సైనిక స్థావరాలతో సహా పాక్‌లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్‌ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్‌డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్‌ సిందూర్‌ను సమర్థవంతంగా నడిపించాయి.

ఆపరేషన్‌ సిందూర్‌లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్‌ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్‌లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్‌ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్‌ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. 

సిందూర్‌ 2.0కు సిద్ధమా?
పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్‌కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌లో చైనా ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్‌ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్‌లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్‌ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్‌–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్‌ యుద్ధంలో గల్ఫ్‌ దేశాలు, యూఎస్‌ఏ, ఇజ్రాయెల్‌లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్‌ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్‌లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్‌ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. 

వ్యూహంలో భాగమే ‘రింగ్‌’ అలర్ట్‌
దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్‌ఫోన్‌ రింగ్‌ అలర్ట్‌’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్‌లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్‌ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement