కెనడా ప్రధాని మార్క్ కార్నీ
విశ్లేషణ
యూఎస్‌ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్‌ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్‌ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.
పరస్పర గమ్యం
యూఎస్‌ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్‌బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్‌లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది.
యూఎస్‌లోని డెయిరీఫామ్‌లు పాల ప్రాసెసింగ్‌కు కెనడాలోని క్యుబెక్‌పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్‌లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్‌లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.
తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.
తమ్ముడు తమ్ముడే...
కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్‌లోని మిచిగన్‌కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్‌చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్‌లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్‌లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.
కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.
కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్‌తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.
దిక్కుతోచని ట్రంప్
ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్‌కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


