తన ఆటలో తానే పావయిందా? | Sakshi Guest Column On USA, Israel, Iran War Issue | Sakshi
Sakshi News home page

తన ఆటలో తానే పావయిందా?

Apr 1 2026 12:17 AM | Updated on Apr 1 2026 12:17 AM

విశ్లేషణ

ఇరాన్‌ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్‌ తరఫున యెమెన్‌లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్‌ గల్ఫ్‌తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్‌ మెండెబ్‌ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్‌ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్‌ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.

అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్‌ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్‌ విదేశాంగ విధానం సోవియట్‌ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్‌ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్‌ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్‌ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.

యుద్ధంతో శాంతా?
ట్రంప్‌ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్‌ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్‌ ప్రభుత్వం అనవసరంగా యూఎస్‌ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు.  అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్‌ వార్‌) తెరతీశాడు. క్రమంగా ట్రంప్‌ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్‌కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్‌ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్‌ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్‌ల్యాండ్‌ను యూఎస్‌ఏకు ఇవ్వాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.

ఇటీవల 2025లో యూఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్‌ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్‌ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్‌ ఫర్‌ పీస్‌) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్‌ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్‌లతో ట్రంప్‌ వెనకడుగు వేశాడు.

డీప్‌ స్టేట్‌ మద్దతు లేదా?
యూఎస్‌ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్‌ స్టేట్‌ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్‌ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్‌ స్టేట్‌ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్‌ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్‌ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్‌ స్టేట్‌ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.

డీప్‌ స్టేట్‌ కనుసన్నల్లో ఉండే యూఎస్‌ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్‌ లక్ష్యాలతో పాటుగా అమెరికన్‌ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్‌ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్‌ డీప్‌ స్టేట్‌ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.

యూఎస్‌ అధ్యక్షులెవరయినా యూఎస్‌ డీప్‌ స్టేట్‌ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్‌పై ట్రంప్‌ ఓటమికి డీప్‌ స్టేట్‌ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్‌ డీప్‌ స్టేట్‌ని పక్కకి నెట్టి హెగ్‌సెత్, కుష్నర్, లిండ్‌సే, విట్‌కాఫ్‌ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్‌ స్టేట్‌ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్‌ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.

ఎంతవరకు పోరాడగలవు?
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్‌ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్‌ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్‌ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్‌కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్‌ హంటింగ్టన్‌ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్‌ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్‌. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.

ఇరాన్‌ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్‌ వంటి గల్ఫ్‌ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్‌ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్‌ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.

కానీ యూఎస్‌ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్‌ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్‌ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్‌ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచారు. యూఎస్‌ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్‌ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్‌ డాలర్లు. 

బాండ్‌ మార్కెట్‌ ద్వారా యూఎస్‌ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్‌ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్‌ గ్యాస్‌ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్‌ బాండ్‌ మార్కెట్‌ తద్వారా యూఎస్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్‌ డీప్‌ స్టేట్‌ లాబీలు ట్రంప్‌ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement