ఇరాన్‌ యుద్ధంలో ఇండియా వైఖరి | Sakshi Guest Column On India stance on the Iran war | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధంలో ఇండియా వైఖరి

Mar 26 2026 12:44 AM | Updated on Mar 26 2026 9:10 AM

Sakshi Guest Column On India stance on the Iran war

విశ్లేషణ

యూఎస్, ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్‌ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్‌ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్‌ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్‌ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్‌–యూఎస్‌ శిబిరంలో భారత్‌ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.

బహుళ అలీన విధానం
ప్రస్తుత ఇరాన్‌ యుద్ధంలో భారత్‌ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్‌ ఫ్యాక్టర్‌ 3. ఇరాన్, యూఎస్‌ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్‌ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్‌ స్థానం 5. భారత్‌ బలాలు – బలహీనతలు.

21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్‌ విచ్ఛిన్నం తరువాత యూఎస్‌ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్‌ఏ, యూరోపి  యన్‌ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్‌ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్‌ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్‌ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. 

నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్‌ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్‌ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. 

ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?
ఇరాన్‌ యుద్ధంలో భారత్‌ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్‌తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్‌ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్‌ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్‌ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్‌ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.

భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్‌ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.

తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్‌కు ఇజ్రాయెల్‌ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్‌ భారత్‌కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్‌కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. 

అందుకే రష్యా, ఇజ్రాయెల్‌కు సంబంధించినంత వరకు భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్‌ యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్‌కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్‌ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్‌ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్‌ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్‌ తలదూర్చి తన జియో పొలిటికల్‌ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.

కిం కర్తవ్యం?
జియో పొలిటికల్‌ కోణంలో పరిశీలిస్తే భారత్‌ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్‌–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్‌ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.

ఇరాన్‌ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్‌ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్‌ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్‌పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్‌తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.

‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్‌ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్‌ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్‌ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్‌కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.

రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్‌లో చైనా–తైవాన్‌ విషయంలో యూఎస్‌ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్‌–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్‌ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్‌ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్‌ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల బోధకులు 

Advertisement
 
Advertisement
Advertisement