'రణక్షేత్రం' ఇండో పసిఫిక్‌కు మారేనా? | Sakshi Guest Column On China, Taiwan Issues | Sakshi
Sakshi News home page

'రణక్షేత్రం' ఇండో పసిఫిక్‌కు మారేనా?

Apr 24 2026 1:01 AM | Updated on Apr 24 2026 1:01 AM

Sakshi Guest Column On China, Taiwan Issues

విశ్లేషణ

ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్‌ యుద్ధం, హార్మూజ్‌ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్‌ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇండో– పసిఫిక్‌లో పావులు కదుపుతున్నాడు. తైవాన్‌ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్‌టీ) నాయకురాలు చెంగ్‌–లీ–వున్‌కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్‌ 10న జిన్‌పింగ్‌ కేఎమ్‌టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. 

తైవాన్‌ విలీనమే చైనా లక్ష్యం
తైవాన్‌ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్‌ఏ పార్ల మెంట్‌ స్పీకర్‌ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్‌ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్‌ఏ తైవాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్‌ ప్రధాని సానయి తకాయిచి తైవాన్‌పై చైనా దాడి చేస్తే దానిని జపాన్‌ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్‌ యుద్ధంలో జపాన్‌ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్‌నే అడ్డా!

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓటమితో 1945లో తైవాన్‌ దీవులను జపాన్‌ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (ఆర్‌ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్‌సీ– ఆర్‌ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్‌సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్‌ఏ కూడా గుర్తించింది. తైవాన్‌ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్‌ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్‌ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్‌ ఉత్పత్తులలో తైవాన్‌ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్‌ తయారీలో తైవాన్‌ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్‌ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. 

నేరుగా అమెరికాకు సవాలు!
1997లో హాంకాంగ్‌ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్‌కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్‌లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్‌మెంట్‌) జరిగింది. అప్పుడు తైవాన్‌లో అధికారంలో ఉన్న కేఎమ్‌టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్‌ఫ్లవర్‌ మూవ్‌మెంట్‌) జరిగింది. హాంకాంగ్‌ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్‌ – రేపు తైవాన్‌’ నినాదం కింద తైవాన్‌కూ  హాంకాంగ్‌ గతి పడుతుందని తైవాన్‌ ప్రజలు విశ్వసిస్తున్నారు. 

ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్‌ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో యూఎస్‌ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్‌ల మధ్య జియో పొలిటి కల్‌ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్‌ శాసిస్తుందని జియో పొలిటికల్‌ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్‌పింగ్‌ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్‌ఏకు సవాలు విసురుతున్నాయి.

1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్‌ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్‌ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్‌తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‘ఈ తరంలోనే తైవాన్‌ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్‌పింగ్‌ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్‌ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్‌ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. 

భారత నౌకాశక్తి కీలకం
సైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్‌ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్‌ దీవులు. జపాన్‌ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్‌ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.

మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్‌), ఫిలిప్ఫైన్స్‌లలో యూఎస్‌ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్‌లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్‌ఏ, జపాన్‌ సభ్యులుగా 2004లో క్వాడ్‌ ఏర్పడింది. క్వాడ్‌ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, యూకే సభ్యులుగా ఆకస్‌ కూటమి పనిచేస్తున్నది.

ఉత్తర పసిఫిక్‌ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, మలేషియా, సింగపూర్‌లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్‌ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్‌కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్‌ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్‌ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్‌ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్‌ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్‌ఏ–జపాన్‌ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్‌ పాత్ర కీలకమవుతుంది. భారత్‌ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
 
Advertisement
Advertisement