ఇప్పటి నుంచే ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకుల చేరికలకు కసరత్తు
తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యలతో తెరపైకి కమల వ్యూహం
గత ఎన్నికల ముందు ఆకర్ష్ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సత్ఫలితాలు
ఆ తర్వాత మూలనపడిన చేరికల ప్రణాళిక.. పాత–కొత్తనేతల మధ్య కుదరని సయోధ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలదళం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నకు పార్టీ ముఖ్య నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిలో ఓ ఎమ్మెల్యే తమతో టచ్‌లోకి వచ్చారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొనగా తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యలతో ఇతర పార్టీల నుంచి నేతల చేరికకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ భారీగా చేరికలకు తెరతీయడం తెలిసిందే. ఇది శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి దోహదపడింది. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, గోడెం నగేశ్ ఎంపీలుగా గెలిచారు. ఆ త ర్వాత ఈ చేరికల ప్రణాళిక మూలన పడడంతో బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు అంతగా ఆసక్తి చూపలేదు.
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా...
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం వేరే పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడం కోసం మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కొనసాగింపుగానే గురువారం రాత్రి పార్టీ ముఖ్యనేతలతో అంతర్గత భేటీ సందర్భంగా చేరికల తలుపులు తెరవాలని.. ఇతర పార్టీల నుంచి నాయకులు చేరితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని నడ్డా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీ గురించి నడ్డా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారని.. హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని నడ్డా కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీలో పాత–కొత్త నేతల మధ్య సమన్వయలేమి సమస్యలు వెంటాడుతుండటంతో స్థానిక నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేయాలని కూడా ఆయన పిలుపునిచి్చనట్లు సమాచారం.
వ్యూహాత్మకంగా అడుగులు..
ప్రస్తుతం అధికార కాంగ్రెస్–ప్ర«దాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టడం ద్వారా ఆయా పార్టీల్లోని వారిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయిల్లో ప్రభావం చూపగల ద్వితీయశ్రేణి నాయకులను చేర్చుకోవడానికి సైతం ప్రాధాన్యం ఇవ్వనున్నారని.. సంస్థాగతంగా అంతగా బలంగా లేకపోవడంతోపాటు గతం నుంచి పట్టులేని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారని తెలియవచ్చింది. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా తెలంగాణ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎంబీసీ వర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతల ఆకర్షణ ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని కమలదళం భావిస్తోంది.


